‘అదుగో’ వచ్చేస్తోంది చూడండి

ravi babu adhugo movie release on august

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న దర్శకుడు రవిబాబు గత రెండు సంవత్సరాలుగా ఒక పంది పిల్లతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. పంది పిల్లతో సినిమా ఏంట్రా బాబోయ్‌ అని అంతా అనుకుంటున్నా కూడా, రవిబాబు మాత్రం సినిమా ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పంది పిల్లను తన ఇంట్లో పెంచుకుంటూ ఉన్నాడు. ఆ పంది పిల్లతోనే సినిమా తీస్తున్నాడు. ఎక్కువ శాతం గ్రాఫిక్స్‌తో పాటు, ఒక విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా రవిబాబు చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని ‘అదుగో’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. తాజాగా చిత్రీకరణ పూర్తి అయినట్లుగా రవిబాబు ప్రకటించాడు.

రెండు సంవత్సరాలుగా వార్తల్లో నానుతున్న పందిపిల్ల చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. ‘అదుగో’ చిత్రాన్ని ఈనెల చివర్లో నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విడుదలకు సిద్దం చేయబోతున్నట్లుగా రవిబాబు చెప్పుకొచ్చాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు రెండవ వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు రవిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఒక మంచి ప్రేమ కథను కూడా చూపించబోతున్నట్లుగా రవిబాబు గతంలో చెప్పిన విషయం తెల్సిందే. సినిమాలో కీలక పాత్రలో పంది కనిపించనుంది. మరి ఆ పంది కథ ఏంటీ? సినిమాలో ఉన్న లవ్‌ స్టోరీకి పందికి సంబంధం ఏంటీ అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రంలో రవిబాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో రాజమౌళి ఈగ చిత్రాన్ని చేయగా, ఇప్పుడు రవిబాబు పందిపిల్ల చిత్రాన్ని చేస్తున్నాడు.