ప్రపంచాన్ని వణికించేస్తున్న వైరస్ కరోనా. ఇప్పుడు ప్రపంచదేశాలన్నీ కరోనా బారిన పడి విలవిలలాడిపోతున్నాయి. అయితే ప్రపంచంలోని శాస్త్రవేత్తలు పలు రకాలుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు కరోనాకు వ్యాక్సిన కనుగొనేందుకు. అయితే అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. తాజాగా కుక్కలతో కరోనా వైరస్ బారిన పడిన బాధితులను కనుక్కోవచ్చని పశువైద్య అసోసియేషన్, కేంద్ర హోంశాఖ స్నీఫర్ డాగ్ డిపార్ట్‌మెంట్ నిర్ధారించింది. కేంద్ర హోంశాఖకు సంబంధించిన పోలీస్ కే9 సెల్‌కు చెందిన కల్నల్ డాక్టర్ పీకే చుంగ్ మాట్లాడుతూ… స్నీపర్ డాగ్స్‌కు కరోనా వైరస్ బారిన పడిన బాధితులను గుర్తించే లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు డ్రగ్స్, బాంబులు, మారణాయుధాలు, నేరస్థులను గుర్తిస్తున్న ఈ డాగ్స్ వైరస్‌ను కూడా గుర్తించగలవన్న అద్భుత విషయం బయటపడిందన్నారు.
అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ కింద కొన్ని దేశాల్లో ఇప్పటికే ఈ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేశారని తెలిపారు. కొన్ని రకాల కాన్సర్‌లను కూడా డాగ్స్ గుర్తిస్తాయని వెల్లడించారు. కల్నల్ ఛుంగ్ గత 26 సంవత్సరాలుగా పోలీస్, మిలటరీ డాగ్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. లాలాజలం, రక్తం, మూత్ర నమూనాలను వాసన చూసి ఈ డాగ్స్ వైరస్ ఉందా? లేదా? అని తేల్చేస్తాయని స్పష్టం చేశారు. కాగా కోవిడ్ 19 పాజిటివ్ పేషంట్లను గుర్తించడం అన్నది ఇప్పటి పరిస్థితుల్లో మన దేశానికే కాదు.. ప్రపంచానికే తలనొప్పిగా మారింది. లండన్ స్కూల్ ఆఫ్ హైజిన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌లో పనిచేసే ప్రొఫేసర్ జెమ్స్ తన బృందం సభ్యులతో దీనిపై ప్రయోగం చేస్తున్నారు. వారు ఇప్పటి వరకు మలేరియా రోగులను గుర్తించడం కోసం ప్రయోగాలు చేశారు. ఇప్పుడు కోవిడ్ 19 కోసం కూడా పనిచేస్తున్నారు. వారు దానికి మెడికల్ డిటెక్షన్ డాగ్స్ అని పేరు పెట్టారని తెలిపారు.