సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కోర్టులోకి అడుగు పెట్టారు. కోవిడ్–19 నిబంధనలకు లోబడి ప్రాక్టీస్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇవ్వడంతో వారంతా మళ్లీ రాకెట్ పట్టారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పర్యవేక్షణలో గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జట్టుకు ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది.
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందిని మాత్రమే ఈ క్యాంప్‌కు ‘సాయ్’ అనుమతించింది. వీరిలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, సాయిప్రణీత్, డబుల్స్ స్పెషలిస్ట్ ఎన్.సిక్కిరెడ్డి మాత్రమే తొలి రోజు శిక్షణలో పాల్గొన్నారు.
సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇంకా ఆట మొదలు పెట్టలేదు. మరో వైపు బెంగళూరులో ఉన్న సిక్కి భాగస్వామి అశ్విని పొన్నప్ప… పురుషుల డబుల్స్ జోడి ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా సాధన షురూ చేయలేదు. చిరాగ్, సాత్విక్, శ్రీకాంత్ తమ స్వస్థలాలు ముంబై, అమలాపురం, గుంటూరులలోనే ఉన్నారు. కరోనా సమస్య లేకుండా సురక్షిత వాతావరణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. గోపీతో పాటు విదేశీ కోచ్‌లు పార్క్ టే సంగ్, ఆగస్ డ్వి సాంటోసో కూడా శిక్షణలో పాల్గొన్నారు.
ఈ ఎనిమిది మంది ఆటగా ళ్లకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ‘సాయ్’ ఆదేశించింది. వీరితో పాటు ఎనిమిది మంది కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది ఎవరైనా కలిసి పని చేస్తుంటే వారంతా కూడా కోవిడ్ టెస్టులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సోమవారం ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.