పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు,విద్య

పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు,విద్య

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి చెన్నుపల్లి విద్య ఆదివారం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సీఎస్‌కే ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. చిన్నారి, విద్యలతో కలిసి రాయుడు దిగిన ఫొటోను కూడా షేర్‌ చేసింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎస్‌కే ఆటగాడు సురేష్‌ రైనా కూడా రాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పండంటి పాపకు జన్మనిచ్చిన రాయుడు, విద్య దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నారితో గడిపే ప్రతి ఒక్క క్షణాన్ని ఆనందించండి. మీరు ఎప్పుడూ ప్రేమ, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

కాగా, రాయుడకు 2009 ఫిబ్రవరి 14న విద్యతో వివాహం అయింది. విద్య బయట ఎక్కువగా కనిపించరు. రాయుడు ఆడిన అంతర్జాతీయ, ఐపీఎల్‌ మ్యాచ్‌లకు హాజరవుతుండేవారు. ఇక, క్రికెట్‌ విషయానికి వస్తే.. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు లభించకపోవడంతో రాయుడు ఆటకు గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. మరోవైపు గత కొన్ని సీజన్లుగా రాయుడు ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.