రాష్ట్రంలోని కాకినాడ, అన్నమయ్య జిల్లాలతో పాటు కర్ణాటకలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు ముగ్గురు రైతులు ఉన్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
16వ నంబరు జాతీయ రహదారిపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వద్ద పాదాలమ్మ ఆలయ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒడిశా నుంచి తమిళనాడుకు తీగచుట్టల లోళ్లతో వెళ్తున్న రెండు లారీల్లో ఒకదాని టైరు పంక్చరైంది. వాటి డ్రైవర్లు రెండు లారీలనూ ఒకదాని వెనుక మరొకటి రోడ్డు పక్కన ఆపారు. పంక్చ రైన లారీ టైరుకు మరమ్మతులు చేస్తుండగా, విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వారిని ఢీకొంది. లారీల డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారిద్దరూ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం రామాంజనేయపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు దాసరి ప్రసాద్, దాసరి కిశోర్ లుగా గుర్తించారు. వీరితో పాటు మరమ్మతుల్లోనే నిమగ్నమైన బండి నాగయ్య కూడా చనిపోయాడు. అతనిది బాపట్ల జిల్లా నక్క బొక్కలపాడు. ఘటనా స్థలికి సమీపంలోని పాదాలమ్మ ఆలయం వద్ద ఆశ్రమంలో ఉండే దివ్యాంగుడు, విశాఖపట్నంజిల్లా శ్రీహరిపురానికి చెందిన దిమిలి లోవరాజు మృతి చెందారు.
అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సరస్వతిపల్లి గ్రామానికి చెందిన డేగల కృష్ణబాబు అతని పిన్ని గంగాభవానీ, ఆమె రెండో కుమార్తె వినీత ద్విచక్ర వాహనంపై రాయచోటిలోని ఆసుపత్రికి వెళ్తున్నారు. మార్గ మధ్యలోని పట్టు పరిశోధన కేంద్రం వద్దకు వెళ్లగానే ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ అకస్మాత్తుగా నిలిపేయడంతో ద్వి చక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. జ్వరంతో బాధపడుతున్న వినీతను ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ప్రమాదంలో కృష్ణబాబు, గంగాభవానీ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వినీతను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీప సింగరాజనహళ్లికి చెందిన కొంత మంది రైతులు.. కర్ణాటకలోని హావేరి జిల్లా బ్యాడగిలో మిరపపంటను అమ్ముకొని తిరిగివస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయింది. వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొంది. కర్ణాటకలోని దావణగెరె శివార్లలో జరిగిన ఈ ప్రమాదంలో రైతులు పింజరి మస్తాన్, ఈరన్న, పెద్ద ఎంకన్న మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.