పెళ్లి తేదీ ఖరారు చేసుకునేందుకు కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరిన ఓ కుటుంబం వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా అయిదుగురు మృతిచెందారు. బళ్లారి నగరం బసవన్న కుంటెకు చెందిన అలీ అలియాస్ కుతుబుద్దీన్‌కు హైదరాబాద్‌లోని బండ్లగూడకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. వివాహ తేదీ ఖరారు చేసుకోవాలని అలీతోపాటు అక్క ఖదీరున్నీ సా, బావ అబ్దుల్ రహమాన్, చెల్లెలు హబీబా, బావ షఫీ, వారి పిల్లలు, బంధువులు, నాన్నమ్మ ఫాతిమా బీ తో కలిసి ఆదివారం రాత్రి 8 గంటలకు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.
అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ టెక్కలయ్య దర్గా సమీపంలో వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొంది. తండ్రీకుమార్తెలు అబ్దుల్ రహమాన్, బుష్ర, ఫాతిమా బీ, హబీబా కుమార్తె వసి షరిఫత్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఖదీరున్నీ సా, ఆమె కుమార్తె మరియా, అలీ, షఫీ, హబీబా, సలీం బీ, కౌసర్, షాజహాన్ బేగంలను అంబులెన్స్‌లో వనపర్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరియా మృతిచెందింది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఏపీలోని కర్నూలుకు తరలించారు. ప్రమాదానికి నిద్రమత్తు, అతివేగమే కారణంగా తెలుస్తోందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని కొత్తకోట ఎస్సై మంజునాథరెడ్డి తెలిపారు.