వైకాపా దురాగతానికి మరో ప్రాణం బలైపోయింది. నీళ్లు పట్టుకోడానికి వచ్చిన ఓ ఎస్టీ మహిళను ట్రాక్టరుతో ఢీకొట్టి చంపాడొక నాయకుడి అనుచరుడు. ‘ఇది వైకాపా ట్యాంకు.. మా పార్టీ వారే తాగునీరు పట్టుకోవాలి.. వేరేవారు పట్టుకోవడానికి వీల్లేదు’ అన్నందుకు ఎదురు ప్రశ్నించడమే ఆ మహిళ తప్పయింది. నన్నే ఎదిరిస్తావా? నీ సంగతి చూస్తా అంటూ వైకాపా సర్పంచి అనుచరుడు అందరూ చూస్తుండగానే మూడుసార్లు ట్రాక్టర్తో ఢీకొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడే పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక ఘటన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం… మల్లవరం తండాలో వారం రోజులుగా తాగునీటి సమస్య వేధిస్తోంది. దీంతో వైకాపాకు చెందిన సర్పంచ్ షేక్ నన్నే సాహెబ్ నాలుగు రోజులుగా ట్రాక్టర్లతో తాగునీటిని సరఫరా చేయిస్తున్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్లవరం తండా కాలనీకి ట్రాక్టర్ ట్యాంకరు వచ్చింది. మహిళలంతా నీరు పట్టుకోవడానికి ఎగబడగా.. మీరు తెదేపాకు చెందిన వారు.. మా పార్టీ అందించే నీరు ఎందుకు పట్టుకుంటున్నారని ట్రాక్టర్ డ్రైవర్, సర్పంచి అనుచరుడు మణికంఠ నాయక్ అడ్డుపడ్డాడు. బిందెలతో నిల్చున్న బాణావత్ సామునిబాయ్.. ‘మా ఇంట్లో బిందె నీరు కూడా లేదు. తాగునీటికి పార్టీలకు సంబంధం ఏంటి? మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ నిలదీసింది. దీంతో డ్రైవర్ మమ్మల్నే ప్రశ్నిస్తారా? అంటూ ట్రాక్టర్ను ఆవిడ కాళ్లపైకి పోనిచ్చాడు. ఇలా మూడుసార్లు మీదకి పోనీయడంతో రక్తగాయాలతో అక్కడే పడిపోయింది. ట్రాక్టర్ ముందువైపు బంపర్ ఆమె పొట్టలో గట్టిగా తగిలింది. వెనుకవైపు గోడ ఉండటంతో ఆమె తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. ట్రాక్టరుతో కాళ్లపై తొక్కించడంతో సామునిబాయ్ తీవ్రంగా గాయపడింది.
వెంటనే ఆమె బంధువులు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మృతురాలికి దివ్యాంగుడైన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలందరూ వివాహితులే. వ్యవసాయ కూలీగా జీవనం పొందేది. మృతురాలి కుటుంబానికి గతంలోనూ మణికంఠ కుటుంబంతో గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మంచినీటి కోసం నిలదీసినప్పుడు కోపంతో ట్రాక్టర్ మీదకు ఎక్కించారనే ఆరోపణలు ఉన్నాయి. తాగునీరు అడిగితే చంపేస్తారా? అని కుటుంబసభ్యులు వైకాపా నేతలను నిలదీస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడని మృతురాలి బంధువులు మాచర్ల ఆసుపత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.