పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఓ విద్యార్థి కాలువలో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాదిలో మంగళవారం జరిగింది. కొత్తబాది ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఫర్హాన్(6) మధ్యాహ్న భోజనం అనంతరం తోటి విద్యార్థులతో ఆడుకుంటూ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న కాలువను గమనించకుండా అందులోకి జారి పడిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు, తల్లి అసిఫాకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు ఫర్హాన్‌ను వెంటనే కాలువ నుంచి బయటికి తీసి.. బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాలకు ప్రహరీ లేకే ఈ దుర్ఘటన జరిగిందని ఆగ్రహించిన గ్రామస్థులు, మృతుడి బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
గతంలో పాఠశాలకు ప్రహరీ ఉండగా పక్కన ప్రాథమిక సహకార సంఘం గోదాం నిర్మాణం కోసం దాన్ని తొలగించారు. ప్రహరీ నిర్మిస్తానని హామీ ఇచ్చిన గుత్తేదారు ఇప్పటికీ నిర్మించలేదని స్థానికులు మండిపడ్డారు.