యువతిపై అత్యాచారం జరిగిన ఘటన పాతబస్తీ బం డ్లగూడ పోలీసుస్టేషను పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. గంటల వ్యవధిలోనే పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్‌అలీ వివరాల ప్రకారం…సూర్యాపేటకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. శనివారం ఏదో విషయమై యువతికి తన సోదరుడితో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సోదరుడు యువతిని కొట్టాడు. మనస్తాపానికి గురైన యువతి బస్టాండుకు వచ్చి హైదరాబాద్ బస్సెక్కింది. శనివారం రాత్రి 10.40 గంటల ప్రాంతంలో ఎంజీబీఎస్ బస్టాండులో దిగింది. బయటికి వచ్చి కొట్టులో టీ తాగిన తరువాత అఫ్జల్‌గంజ్ వైపు నడుచుకుంటూ వస్తోంది. యువతిని చూసిన గౌస్‌నగర్‌కు చెందిన ములకలపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్‌గంజ్‌కు చెందిన పానగంటి కాశీవిశ్వనాథ్(32)లు ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. ఆమె దగ్గరికి వెళ్లి ఎక్కడికెళ్లాలని అడగ్గా… సమీపంలోని పోలీసుస్టేషనుకు వెళ్లాలని చెప్పింది. తాము అక్కడికే వెళ్తున్నామని.. నిన్నూ తీసుకెళ్తామని చెప్పి బైకు ఎక్కమన్నారు. వారిని నమ్మిన యువతి ద్విచక్రవాహనం ఎక్కింది.
కొద్దిదూరం వెళ్లాక అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో ఓ ఐస్‌క్రీం పార్లర్ వద్ద ఆపి ఐస్‌క్రీం తినిపించి తమపై నమ్మకం కలిగేలా చేశారు. తరువాత ఆమెను నేరుగా బండ్లగూడ ఠాణా పరిధి లేక్‌వ్యూ హిల్స్ సమీపంలోని శ్రీకాంత్‌కు చెందిన స్క్రాప్ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరోచోటికి తరలించేందుకు బైకుపై తీసుకెళ్తుండగా బాధితురాలు అరిచింది. స్థానికులు గమనించడంతో నిందితులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ కె.గురునాథ్, బండ్లగూడ ఎస్సై వెంకటేశ్వర్జీలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. తనపై అఘాయిత్యం జరిగిన స్క్రాప్ గోడౌన్‌ను ఆమె చూపించింది. ఈ గోడౌన్ శ్రీకాంత్దని స్థానికులు చెప్పారు. వెంటనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతనిచ్చిన సమాచారంతో కాశీవిశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేయగా ఇద్దరూ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.