బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఆదివారం వైకాపా నిర్వహించిన సిద్ధం సభకు వెళ్లేందుకు నిరాకరించిన వ్యక్తిపై ఆ పార్టీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటన జే పంగులూరు మండలం రామకూరులో చోటుచేసుకుంది. క్షతగాత్రుడు తెలిపిన ప్రకారం .. రామకూరు గ్రామానికి చెందిన తలారి ధనచక్రవర్తి తొలుత వైకాపా సానుభూతిపరుడు. రెండేళ్ల క్రితం తెదేపాలో చేరారు. అప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు అతనిపై గుర్రుగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో సిద్ధం సభకు రావాలంటూ గ్రామ వైకాపా నేతలు ఆంజనేయులు, రామాంజనేయులు కోరారు. పొలం పనులు ఉన్నాయని, సభకు రాలేనని ధనచక్రవర్తి చెప్పారు. దీన్ని మనసులో ఉంచుకున్న వైకాపా నాయకులు.. ధనచక్రవర్తికి చెందిన ట్రాక్టర్ గ్రామ కూడలిలో ఉండగా రవాణాకు అడ్డువస్తోం దని, వెంటనే తీయాలంటూ హుకుం జారీచేశారు. వాహనాలు వెళ్లేందుకు ఎక్కువే స్థలం ఉందని పేర్కొంటూ తన ట్రాక్టర్ తీసేందుకు ధనచక్రవర్తి సిద్ధపడ్డారు. ఇదే అదనుగా భావించిన వైకాపా నాయకులు, కార్యకర్తలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో అతని తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. అద్దంకి పోలీసులు క్షతగాత్రుడి వద్ద వివరాలు సేకరించారు.