బోగస్ కంపెనీల పేరుతో రూ.14.25 కోట్ల జీఎస్టీ మోసాలకు పాల్పడిన ఆడిటర్ వీఎన్ఎస్ భాస్కర్‌ను అరెస్టు చేసినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ‘ఈనాడు’కు చెప్పారు. తమ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పక్కాగా ఆధారాలు లభించడంతో అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌కు పంపుతూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ‘భాస్కర్ అసోసియేట్స్ ’ అనే సంస్థ పేరుతో అతను 15 కంపెనీలను జీఎస్టీ చెల్లింపుల కోసం రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నామంటూ గత రెండేళ్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి.. రూ.14,25,64,848 జీఎస్టీ రిఫండ్ తీసుకున్నారు. శాఖ అధికారులు అనుమానించి అతని కార్యాలయం, ఇళ్లలో సోదాలు చేయగా బోగస్ పత్రాలు లభ్యమైనట్లు శ్రీదేవి తెలిపారు. జీఎస్టీ ఎగవేత, రిఫండ్ పేరుతో అడ్డగోలుగా మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు తనిఖీలు చేయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.