Crime: తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్

Crime: Constable committed suicide by shooting himself
Crime: Constable committed suicide by shooting himself

‘అమ్మా.. నాన్నకి ఫోన్ చేయవా..’ అని ఉదయం లేవగానే అడిగిన చిన్నారికి ఇప్పుడు వచ్చేస్తారమ్మా అని తల్లి చెప్పింది. అలా అన్న కొద్దిసేపటికే గుండెలు పగిలేలా.. భర్త మరణ వార్త ఆమె చెవిన పడింది. డ్యూటీ నుంచి నాన్న వచ్చే సమయం కావడంతో అమాయకంగా ఎదురుచూస్తున్న పిల్లలకు ఇక ఎప్పటికీ రారనే విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక తల్లి గుండెలు పగిలేలా రోదించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశా గ్రామానికి చెందిన పాలవలస శంకర్రావ్ 2010లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఏపీఎస్పీఎఫ్) కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం విశాఖపట్నం ద్వా రకానగర్లోని ఓ బ్యాంకు శాఖలో కాపలాదారుగా పనిచేస్తున్నారు.

భార్య శ్రావణికుమారి, కుమారుడు కిశోర్ చంద్రదేవ్, కుమార్తెతో కలిసి శివాజీపాలెంలో నివసిస్తున్నారు. శంకర్రావ్ గురువారం ఉదయం 5 గంటలకు విధులకు హాజరయ్యారు. సుమారు 6 గంటల ప్రాంతంలో పనిచేస్తున్న చోటే కూర్చొని తుపాకీని గుండె వైపు పెట్టుకొని కాల్చు కొని ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడున్న సిబ్బంది ఆ సమాచారాన్ని ద్వారకా పోలీసులకు అందించారు. ఏసీపీ రాంబాబు, సీఐ రమేశ్, ఎస్.ఐ ధర్మేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఆత్మహత్య ఘటన దృశ్యాల్ని చూశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ఏసీపీ రాంబాబు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.