హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రధాన నిందితుడు అయిన, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అయితే అతడి కోసం గాలిస్తున్న పంజాగుట్ట పోలీసులు సాహిల్ దుబాయ్‌కి పారిపోయినట్టు నిర్ధారించారు. ఈనెల 23న అర్ధరాత్రి దాటాక మితిమీరిన వేగంతో కారు నడిపిన సాహిల్ ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాహిల్ మొదట తన డ్రైవర్ను పోలీసుల వద్దకు పంపిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని తొలుత ముంబయికి, అక్కడి నుంచి సోమవారం దుబాయ్‌కి వెళ్లిపోయినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దుబాయి నుంచి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే తనయుడిని కేసులో నుంచి తప్పించేందుకు రూ.20-25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంపిణీలో తలెత్తిన విభేదాలతోనే విషయం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఈ విషయంపైనా అధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు.