నగరంలోని జూబ్లీహిల్స్‌లో బుధవారం హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన తారక్‌రామ్ (30) మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరో బౌన్సర్ రాజుతో కలిసి జూబ్లీహిల్స్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెద్దమ్మ గుడి కమాన్ సమీపంలో మలుపు వద్ద వేగంగా వెనుక నుంచి వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చొన్న రాజుకు తీవ్రగాయాలయ్యాయి.
కారు నడుపుతున్న వ్యక్తి ప్రమాదాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఈ కేసును వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.