హైదరాబాద్ నగర శివారు మొయినాబాద్‌లో యువతి మృతి కేసు మలుపు తిరిగింది. ఈ ఘటన ఆత్మహత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మల్లేపల్లికి చెందిన తైసీల్ (22).. రెండు రోజుల కింద ఇంటి నుంచి ఒంటరిగా వచ్చి పెట్రోల్ లేదా డీజిల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగాన్వేషణలో ఉన్న యువతి.. ఇప్పటికే 2-3 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇంట్లో గొడవపడి ఒకట్రెండు రోజుల్లో తిరిగి వచ్చేదని, ఈసారి అలాగే జరుగుతుందని భావించి ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది.
హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్పై సీపీ ఆగ్రహం
ఈ కేసులో హబీబ్‌నగర్ పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఇన్స్పె క్టర్‌పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 8 నుంచి తైసీల్ కనిపించకుండా పోగా, 10న యువతి సోదరుడు అజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో విషయం తెలుసుకుని సీపీ పీఎస్‌కు వెళ్లారు. ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోనున్నారు.