తన నాలుగేళ్ల కుమారుణ్ని గోవాలో హత్య చేసి శవాన్ని సూటుకేసులో పెట్టి, టాక్సీలో బెంగళూరుకు తరలిస్తున్న ఓ కంపెనీ సీఈవో సుచనా సేఠ్‌ను కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదమే బాలుడి హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి శవాన్ని స్వా ధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం హిరియూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన సుచనా సేఠ్ ఓ అంకురసంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. భర్తతో విడాకులు తీసుకొని వేరుగా నివాసం ఉంటున్నారు. శనివారం ఆమె తన కుమారుణ్ని తీసుకొని గోవా వెళ్లారు. అక్కడ ఒక అపార్ట్మెంటును 2 రోజులకు అద్దెకు తీసుకొన్నారు. తనకు సోమవారం బెంగళూరు వెళ్లేందుకు టాక్సీ ఏర్పాటు చేయాలని అక్కడి సిబ్బందిని కోరారు. సోమవారం అపార్ట్మెంటు వద్దకు వచ్చిన టాక్సీలో తన సూటుకేసు, ఇతర వస్తువులతో బెం గళూరు బయలుదేరారు.
ఆమె చెక్అవుట్ చేసిన తర్వాత గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది అక్కడ రక్తం మరకలు ఉండటాన్ని గుర్తించి.. ఆ విషయాన్ని అపార్ట్మెంటు నిర్వాహకులకు చేరవేశారు. హోటల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హోటల్లో దిగినప్పుడు కుమారుడితో కన్పించిన సుచనా.. వెళ్లేటప్పుడు మాత్రం ఒంటరిగా కన్పించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే టాక్సీ డ్రైవర్‌కి ఫోన్ చేసి బాలుడి ఆచూకీ తెలుసుకోవాలని సూచించారు. డ్రైవర్ ఆమెను ఆరా తీయగా.. తన కుమారుణ్ని గోవాలోని స్నేహితుని ఇంట్లో వదిలిపెట్టినట్లు సమాధానమిచ్చారు. ఆ చిరునామా పరిశీలించగా అది తప్పుడు అడ్రస్‌గా గుర్తించారు. పోలీసులు ఆమెకు అనుమానం రాకుండా ఆ వాహన డ్రైవర్‌తో కొంకణి భాషలో మాట్లాడారు. చివరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. హత్యకుగల కారణాలు తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.