Crime: ఇద్దరు సివంగుల దెబ్బకు పారిపోయిన దొంగలు..!

Crime: The robbers who escaped after being hit by two Sivangas..!
Crime: The robbers who escaped after being hit by two Sivangas..!

తుపాకీ గురిపెట్టి బెదిరించినా వెరవకుండా తల్లీకుమార్తెలు ప్రదర్శించిన ధైర్యసాహసాలకు దోపిడీ దొంగలు తోకముడిచారు. బేగంపేట పోలీస్స్టేషన్ పరిధిలోని రసూల్పుర జైన్ కాలనీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. నవరతన్ జైన్, ఆయన భార్య అమిత మేహోత్ రసూల్పురలోని పైగా హౌసింగ్కాలనీలో నివాసముంటున్నారు. గురువారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అమిత, ఆమె కుమార్తె, పనిమనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్చంద్, సుశీల్కుమార్ కొరియర్ సర్వీసు వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. అమిత వారిద్దరినీ తలుపు బయటే ఉండాలని చెప్పగా హెల్మెట్ ధరించిన సుశీల్కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో అమిత.. సుశీల్ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈ లోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్ దాడి చేస్తున్నా .. వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలి పరారయ్యాడు. ఈ లోపు తల్లీకుమార్తెల కేకలు విని ఇరుగుపొరుగు వారు చేరుకున్నారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. సుశీల్ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం వీరిద్దరు ఇంటిపని కావాలంటూ అమిత ఇంటికి వచ్చారు. కొంతకాలం పనిచేశారు. ఇంట్లో ఎక్కడెక్కడ ఏయే వస్తువులు ఉంటాయో తెలుసుకుని అకస్మాత్తుగా పని మానేశారు. మళ్లీ గురువారం మధ్యాహ్నం వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారు.