ఇన్స్టాగ్రాం ద్వారా నకిలీ వెబ్సైట్ లింక్ పంపి ఓ నిరుద్యోగ యువతి నుంచి నగదు కాజేసిన ఘటనపై గురువారం కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్య శ్రీ బీటెక్ పూర్తి చేసింది. ఈ నెల 2న ఆమె ఇన్‌స్టాగ్రాంకు ‘వర్క్ ఫ్రమ్ హోం’ జాబ్ లింక్‌ను అపరిచిత వ్యక్తులు పంపారు. దాన్ని తెరిచి టాస్క్ ప్రారంభించాలని చరవాణిలో సూచన రావటంతో ఆమె లింక్ ఓపెన్ చేశారు. నగదు పంపితే అంతకంటే ఎక్కువ మొత్తం తిరిగి వస్తుందని చరవాణిలో సందేశం పంపి యువతిని నమ్మబలికారు.
నిజమే అని భావించిన యువతి తన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి ఏడు దఫాలుగా మొత్తం రూ.91,100 పంపారు. చివరకు అనుమానం వచ్చి తాను పంపిన డబ్బులు తిరిగి పంపాలని కోరగా రూ.83 వేలు పన్ను చెల్లిస్తే సొమ్ము తిరిగి ఖాతాలోకి వస్తాయని అపరిచిత వ్యక్తులు సమాధానమిచ్చారు. దీంతో తాను మోసపోయినట్లు నిర్ధారించుకున్న బాధితురాలు అదే రోజు సైబర్ క్రైం 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. గురువారం స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.