ఒకటో తేదీన లబ్ధిదారులకు పింఛను అందించడానికి ఉన్న తాధికారి నుంచి నగదు తీసుకున్న వాలంటీరు.. మరుసటి రోజు రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి పదో వార్డులో కిలారి నాగరాజు(29) రెండేళ్ల నుంచి వాలంటీరుగా పని చేస్తున్నారు. అతని సోదరుడు రవి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అధికారులు ఇతన్ని నియమించారు. గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో నాగరాజు సచివాలయానికి వెళ్లి.. లబ్ధిదారులకు అందించాల్సిన రూ.75 వేల పింఛను సొమ్మును సంక్షేమాధికారి శశి నుంచి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున గున్న తోటవలస సమీపంలో రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మరణించారు. అటుగా వెళ్తున్న గ్యాంగ్‌మెన్ చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాన్ని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పింఛను సొమ్ము పం పిణీ చేయకుండానే మృతి చెందడంతో ఆ నగదు ఏమైందన్నది చర్చనీయాంశంగా మారింది.
రైల్వే కానిస్టేబుల్ కృష్ణ మృతదేహాన్ని పరిశీలించినప్పుడు అతని వద్ద రూ.26 వేలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నాగరాజుకు ఏడాది క్రితం లింగమ్మ వలసకు చెందిన స్వప్నతో వివాహమైంది. ఆమె ప్రస్తుతం గర్భిణి కావడంతో తల్లిగారింటికి వెళ్లారు. నాగరాజు తల్లి లక్ష్మి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో గురువారం రాత్రి ఏం జరిగిందో తెలియడం లేదు. మృతుడి కాల్‌డేటాను పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కేసు నమోదు చేస్తామని రైల్వే ఎస్సై రవివర్మ తెలిపారు. పింఛను సొమ్ము గురించి బొబ్బిలి పోలీసులకు, డీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి తెలిపారు.