వైజాగ్ లో యువతి అనుమానాస్పద మృతి.. శరీరంపై సిగరెట్ వాతలు..

ఆంధ్రప్రదేశ్ లో యువతులపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి అనడం కంటే పెట్రేగిపోతున్నాయి అనడం సమంజసం. తాజాగా విశాఖ నగరం ఉలిక్కి పడింది. వైజాగ్ లోని అక్కయ్యపాలెంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. 22 ఏళ్ల దివ్య అనే యువతి ఫిట్స్‌తో చనిపోయినట్లు టాక్ నడుస్తోంది. కానీ ఫిట్స్ తో చనిపోతే శరీరంపై సిగరెట్ వాతలు ఎందుకుంటాయ్ అనే అనుమానాలు జనాలను పీడిస్తున్నాయి.

అయితే ఫిట్స్ అనే ప్రచారంతో చనిపోయిందని… ఆ మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకువస్తున్నట్టు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాపరికి ఫోన్‌ వచ్చింది. కాగా అనుమానంతో ఆ కాటికాపరి పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహంపై గాయాలు, సిగరెట్‌తో వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు పోస్టు మార్టానికి తరలించారు. కాగా విశాఖలోని అక్కయ్యపాలెంలోని చెక్కుడురాయి బిల్డింగ్ వద్ద నివాసం ఉంటోన్న గుట్టల వసంత అనే మహిళకు కొంతకాలం క్రితం పెళ్లైంది. ఆమె భర్త ఉపాధి కోసం దుబాయిలో ఉండటంతో ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆర్నెల్ల క్రితం ఆమెకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన దివ్య అనే యువతితో పరిచయమైంది. దీంతో ఆ యువతి అప్పటి నుంచి వసంత ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం దివ్య ఫిట్స్‌తో చనిపోయిందంటూ వసంత తన బంధువులకు తెలిపింది. దీంతో అంతా ఆమె ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే ముందురోజు వరకు బాగానే ఉన్న యువతి వెంటనే అలా చనిపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కానీ.. ఎవరూ పోలీసులకు చెప్పే ధైర్యం చేయలేదు.

అలా దివ్య అంత్రక్రియలు నిర్వహించేందుకు వసంత బంధువులు జ్ఞానాపురంలోని శ్మశానవాటిక కాటికాపరికి చెప్పారు. మృతురాలి వివరాలన్నీ తీసుకున్న కాటికాపరికి 22 ఏళ్ల మహిళ ఫిట్స్‌తో చనిపోవడం నమ్మలేకపోయాడు. వెంటనే విశాఖ ఫోర్త్ టౌన్ పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే వసంత ఇంటికి చేరుకుని దివ్య మృతదేహాన్ని పరిశీలించారు. శరీరంపై అనేక చోట్ల గాయాలుండటం, వీపు భాగంలో సిగరెట్‌ వాతలు పెట్టిన ఆనవాళ్లు ఉండటం, జుట్టు కూడా కత్తిరించి ఉండటంతో పోలీసులు వెంటనే క్లూస్‌ టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.

అంతేకాకుండా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే వసంతతో పాటు ఆమె సోదరి మంజులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసులు ఈ కేసును వ్యభిచార కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వ్యభిచారం చేసేందుకు అంగీకరించక పోవడం వల్లే దివ్యను చిత్రహింసలు పెట్టి చంపి ఉండ వచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.