Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు భారతీయ మహిళలు అనగానే చీరకట్టే గుర్తొచ్చేది. ఏ సందర్భంలోనయినా మహిళలు చీరకట్టులోనే కనిపించేవారు. గృహిణిలే కాదు… వివిధ రంగాల్లో ఉద్యోగం చేసే మహిళలు కూడా చీరలనే ధరించేవారు. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే చీర మహిళలకు హుందాతనం తెచ్చిపెట్టేది. కాలక్రమంలో అన్ని విషయాల్లో మార్పులొచ్చినట్టే..మహిళల వస్త్రధారణ కూడా సమూల మార్పులకు లోనయింది. ఒకప్పుడు 15, 16 ఏళ్లు వచ్చేసరికి అమ్మాయిలు చీరకట్టులోకి మారిపోయేవారు. ఇప్పుడు మాత్రం 30 ఏళ్లు దాటినా..చీర రోజువారీ వస్త్రధారణలో భాగం కావడం లేదు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే మహిళలు చీరకట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహిణులు, ఉద్యోగినులు అన్న తేడా లేదు..అందరూ…మోడ్రన్ డ్రెస్సులకు అలవాటు పడిపోయారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
మోడ్రన్ గా కనిపించాలన్నది ఒక భావన అయితే..డ్రెస్ లో ఉన్నంత సౌకర్యం చీరలో లేకపోవడం, చీర కట్టుకోడానికి ఎక్కువసమయం పట్టడం వంటి కారణాలతో మహిళలు సంప్రదాయ చీరకట్టును ఇష్టపడడం లేదు. అందుకే ఎవరన్నా ఉద్యోగిని చీర కట్టుకుని వస్తే..మిగిలిన వారు స్పెషల్ ఏంటి అని అడగటం ఆఫీసుల్లో సర్వసాధారణం. అలా ఒకప్పుడు రోజువారీ వస్త్రధారణలో భాగమైన చీర…ప్రస్తుతం..ప్రత్యేక సందర్భాలకు పరిమితమయింది. అలాగని ఈ తరం అమ్మాయిలు చీరలను పూర్తిగా పక్కనబెట్టారనీ చెప్పలేము. స్పెషల్ అకేషన్ రాగానే చీరకట్టులో కనిపిస్తున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే.. ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాషన్ చీర కట్టుకుంటున్నారు. వేలకు వేలు ఖర్చుపెట్టి చీరలు కొంటున్నారు. చీరల కోసం షాపింగ్ మాల్స్ లో గంటల తరబడి షాపింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇదివరిలా రోజూ చీరకట్టుకోడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు ఆఫీసుకు చీరకట్టుకుని వెళ్లడాన్ని ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఈ విషయాన్నే ఇండియా టుడే న్యూస్ చానల్ ఓ వీడియో రూపంలో వివరించింది. ఆఫీసుకు చీర ధరించి వెళ్తే ఎదుర్కొనే సమస్యలివే అంటూ ట్విట్టర్ లో ఆ చానల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. చీరకట్టుకుని ఆఫీసుకు వెళ్తే..సరిగా నడవడం కష్టం. అందరూ పెళ్లయిందా అని అడుగుతారు. ఆంటీ అని పిలుస్తారు. పురుష ఉద్యోగులు గుచ్చిగుచ్చిచూస్తారు వంటి సమస్యలను వీడియోలో చూపించారు. అయితే ఆ వీడియో చూస్తే పాజిటివ్ ఫీలింగ్ కలగడం లేదు. చీరే అన్ని సమస్యలకు మూలం అన్నట్టు వీడియోను చిత్రీకరించారు.
చీరకట్టుకున్న మహిళలు సరిగ్గా నడవలేరు, వాష్ రూమ్ కు వెళ్లడం కష్టం, ఇతర ఉద్యోగులు వేళాకోళంగా మాట్లాడుతుంటారు..అన్నట్టుగా ఈ వీడియో ఉంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ వీడియోతో భారతీయ సంస్కృతిని కించపరుస్తున్నారని, చీర కట్టుకున్న మహిళలకు ఇండియాటుడే ఆఫీసులో అలాంటి పరిస్థితులు ఉన్నాయేమో కానీ..మిగిలిన చోట్ల అలా లేదని నెటిజన్లు కామెంట్ చేశారు. చీరల్లో ఆఫీసుకెళ్లి ఇస్రో సైంటిస్టులు మార్స్ మిషన్ పూర్తిచేశారని, టాలెంట్, పనితనం ముఖ్యం అని, వేషధారణ కాదని నెటిజన్లు విమర్శించారు.
Wearing a sari to your office is one hell of an uphill climb. #LifeTak
See more videos at https://t.co/NounxnP7mg pic.twitter.com/781xLi2Pez— India Today (@IndiaToday) October 28, 2017