రాజధాని కోసం ఖర్చు పెడుతున్న లక్ష కోట్లు

రాజధాని కోసం లక్ష కోట్లు ఖర్చు

జగన్ అనుకున్నది.. ముందు నుంచీ చెబుతున్నదే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక రూపంలో ఇచ్చింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పోలిస్తే..బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ విశాఖపట్నానికి మరింత అడ్వాంటేజ్ ఇచ్చిది. విశాఖలో సెక్రటేరియట్, సీఎం క్యాంపాఫీస్, గవర్నర్ రాజ్ భవన్, అత్యవసర అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ … కూడా పెట్టాలని సూచించింది. అంటే.. వ్యవస్థలన్నీ.. విశాఖలో ఉన్నట్లే. అమరావతిలో అసెంబ్లీ భవనం ఉంటుంది. అందులో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయో లేదో చెప్పడం కష్టం. అదే సమయంలో.. ఓ హైకోర్టు బెంచ్ ను.. కూడా ప్రతిపాదించారు. ఇక కర్నూలులో హైకోర్టు ప్రధాన భవనం.. ఇతత ట్రిబ్యునళ్ల ఆఫీసులు ప్రతిపాదించారు.

విశాఖలో మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్నాయని.. విజయవాడలో లేవని.. బీసీజీ నివేదిక ఇచ్చినట్లుగా.. వివరాలు చెప్పిన ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయకుమార్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు సహా.. అన్నీ విజయవాడ నుంచి నడుస్తున్నట్లు ప్రభుత్వానికి గుర్తున్నట్లుగా లేదు. అదే సమయంలో… ఉద్యోగులకు.. మంత్రులకు.. ఎమ్మెల్యేలకు కావాల్సిన నిర్మాణాలు తొంభై శాతం పూర్తయ్యాయనే విషయాన్ని కూడా.. విస్మరించారు. రాజధాని తరలించడానికి ప్రాతిపదిక కావాలనుకుంటున్న ప్రభుత్వం.. పనిలో పనిగా అమరావతిపై వరద ముంపు అనే రాయి కూడా వేసింది. 2009లో వచ్చిన వరదల్లో అమరావతి ప్రాంతం మునిగిందని చెప్పుకొచ్చింది.

నిజానికి ఆ వరదల్లో కర్నూలు కొట్టుకుపోయింది. కర్నూలు జిల్లా మొత్తం అతలాకుతలమయింది. కానీ ప్రస్తుతం అమరావతి ఉన్న గ్రామాలకు మాత్రం ముప్పు రాలేదు. అలాగే.. విశాఖకు ఉన్న తుపాన్ల ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హుదూద్ దెబ్బకు.. మొత్తం వ్యవస్థలన్నీ.. నెల రోజులకుపైగా.. పని చేయని పరిస్థితి.. అక్కడ ఉంది. ఈ రెండింటితో పోలిస్తే.. అమరావతిలోనే ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని బీసీజీతో చెప్పించింది ప్రభుత్వం. అమరావతి ఖర్చు విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదనను బీసీజీ నివేదికలో చెప్పుకొచ్చింది. రాజధానిపై లక్ష కోట్లు ఖర్చు పెడితే.. అంత సొమ్ము తిరిగి రాదని చెప్పింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నామో.. ఓ బ్లూప్రింట్ విడుదల చేశారు. అందులోని విషయాలే.. చాలా పేజీల్లో నిండిపోయి ఉంది. చివరికి ప్రభుత్వానికి కావాల్సిన నివేదికను.. బీసీజీ పొందు పర్చింది. ప్రభుత్వం అనుకున్నట్లుగా విశాఖకు అనుకూలంగా.. బీసీజీ నివేదిక ఇచ్చింది.