లాక్ డౌన్ అదునుగా… బెదిరింపులకు సైబర్ నేరగాళ్లు…

లాక్ డౌన్ సమయంలో సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గత 18 రోజులుగా ఎనిమిది మంది బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇది వారిని బెదిరించేందుకు సైబర్‌ నేరగాళ్లు వాడుతున్న అస్త్రంగా అనుమానం వస్తుంది. అశ్లీల వెబ్‌సైట్లు చూడడం.. అలా చేయనివారు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేస్తుండగా.. వీక్షించిన వాళ్లు మాత్రం గప్‌చుప్‌గా నేరగాళ్లు కోరిన మొత్తాలు చెల్లించేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అయితే కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. దీంతో అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఫలితంగా అశ్లీల వెబ్‌సైట్ల వీక్షణం గణనీయంగా పెరిగిందని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పోర్న్‌ వెబ్‌సైట్‌గా పేరుగాంచిన పోర్న్‌ హబ్‌ రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ ధోరణి కొనసాగుతోందని పేర్కొంది. దేశంలోని దాదాపు ప్రతి టెలికం సంస్థా అశ్లీల వెబ్‌సైట్స్‌ను బ్యాన్‌ చేశాయి. అయినప్పటికీ మిర్రర్‌ డొమైన్స్‌ ద్వారా వీటిని చూస్తున్నారని పోర్న్‌ వెబ్‌ సంస్థ స్పష్టం చేస్తోంది. సాధారణ సమయాల్లో కంటే లాక్‌డౌన్‌ వేళ వీటి వినియోగం ఏకంగా 35 శాతం పెరిగినట్లు గణాంకాలు విడుదల చేసింది.

కాగా దేశంలో పూర్తి స్థాయి నిషేధం ఉండి.. తీవ్రమైన నేరంగా పరిగణించే చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీక్షణ 90 శాతం పైగా పెరిగినట్లు పోర్న్‌ హబ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో అదునుగా భావించి క్యాష్‌ చేసుకోనేందుకు నైజీరియాతో పాటు మరికొన్ని సౌత్‌ ఆఫ్రికా దేశాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ఓ ప్లాన్ ప్రకారం వీళ్లే కొన్ని రకాలైన అశ్లీల వెబ్‌సైట్స్‌ను రన్‌ చేస్తున్నారు. వీటికి బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌ను నిక్షిప్తం చేస్తున్నారు. ఫలితంగా ఎవరైనా ఈ సైట్స్‌లోకి ఎంటరై అశ్లీల చిత్రాలు, వీడియోలను వీక్షిస్తుంటే బ్యాక్‌గ్రౌండ్‌లో నిక్షిప్తమై ఉన్న ప్రోగ్రామింగ్‌ దానంతట అదే యాక్టివేట్‌ అవుతుంది. ఆ వెంటనే సదరు సైట్‌ను వీక్షిస్తున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌ ఫోన్‌లకు చెందిన కెమెరా తక్షణం యాక్టివేట్‌ అయి ఆ వ్యక్తి ఫొటోను తీస్తుంది. దీంతో పాటు అతడి మెయిల్‌ ఐడీ, దాని అనుబంధ వివరాలు, వీక్షించిన సైట్, సమయం వంటివి నమోదు చేస్తుంది.

కాగా పోర్న్‌ సైట్‌ చూసిన వ్యక్తి ఈ–మెయిల్‌ ఐడీకి బెదిరింపు మెయిల్‌ పంపిస్తున్నారు. ఇందులో అతడి ఫొటో, వీక్షించిన సైట్‌ వివరాలు, సమయం వంటివి జత చేస్తున్నారు. వాటిలో కొందరికి వచ్చిన మెయిల్స్‌లో వారి ప్రస్తుత పాస్‌వర్డ్స్‌ కాకుండా గతంలో వినియోగించినవి పొందు పరిచారు. ఇలాంటి మెయిల్స్‌ వచ్చిన వాళ్లు భయపడవద్దని, తక్షణం తమ మెయిల్స్‌కు చెందిన పాస్‌ వర్డ్స్‌ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ బెదిరింపు మెయిల్స్‌ పంపిస్తున్నది నైజీరియా వంటి దేశాలకు చెందిన వారే అని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.