కరోనా ఎఫెక్ట్.. ఓ వైద్యుడికి నాలుగు లక్షలు టోపీ

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా. ఇప్పుడు ఇది తీవ్రరూపం దాల్చుతుంది. దీంతో పాటు సైబర్ నేరగాళ్ల దందా కూడా సాగుతుంది. వైరస్‌ భయాన్ని అవకాశంగా మలుచుకొని హైదరాబాద్‌లో ఈ మధ్య ఓ డాక్టర్‌ను దోచుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. మాస్కులకు డిమాండ్ బాగా పెరగడంతో హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ షేక్‌ సమద్‌ అబ్దుల్‌.. ఆన్‌లైన్‌ లో వాటిని కొనేందుకు ప్రయత్నించారు. చైనాకు చెందిన అలీబాబా వెబ్‌సైట్‌లో వెతికారు. అలా వెతుకుతున్న సమయంలోనే ఆ డాక్టర్‌‌కు ఫోన్ కాల్ వచ్చింది.

అదేమంటే… పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తాను అలీబాబా వెబ్‌సైట్‌ ద్వారా మాస్కులు అమ్ముతున్నామని.. డాక్టర్‌ను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన డాక్టర్‌ అబ్దుల్‌ తనకు 50 పెట్టెల నిండా మాస్కులు అవసరమని తెలిపాడు. అంతేకాకుండా వాటిని పంపాలని కూడా కోరాడు. అవతల ఫోన్ చేసిన వ్యక్తి మొత్తం రూ.15 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి… అడ్వాన్స్ 30 శాతం చెల్లించాలని కూడా తెలిపాడు. అందుకు డాక్టర్ ఫోన్లోనే వివరాలు చెప్పి .. ఆ ఆగంతకుడి బ్యాంకు ఖాతాకు వైద్యుడు నాలుగున్నర లక్షలు పంపించాడు. అంతే.. ఆర్డర్ విషయం ఏమైందని డాక్టర్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో మోసపోయినట్లు భావించిన వైద్యుడు హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.