హైదరాబాద్ రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఎన్నో కేసులను పోలీసులు పరిష్కరిస్తున్నా సైబర్ క్రిమినల్స్ సరికొత్త దారుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులకు ముందుకు సరికొత్త కేసు వచ్చింది.
కేటుగాళ్లు ఓటీపీ చెప్పకుండానే ఇద్దరి మహిళల ఖాతాల నుంచి రూ.19 లక్షలు లాగేశారు. ఒకరి ఖాతా నుంచి మరొకరికి డబ్బులు మళ్లించడంతో పాటు డెబిట్ కార్డులు బాధితుల దగ్గరుండగానే వేరే ప్రాంతంలోని ఏటీఎంల్లో డబ్బు విత్‌డ్రా చేసుకున్నారు. తమ సర్వర్ కూడా హ్యాక్ చేసి ఉంటారని బ్యాంక్ అధికారులు సైతం చేతులెత్తేయడంతో ఈ మిస్టరీ ఇంకా వీడలేదు.
దిల్లీకి చెందిన మహిళ కొంతకాలంగా హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉంటోంది. ఇల్లు కొనుగోలు చేసేందుకు రూ.17 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంచుకుంది. 20 రోజుల కిందట అమెజాన్‌లో బుక్ చేసిన ఆర్డర్ డెలివరీ కాలేదు. దీంతో ఆ కంపెనీ కాల్‌సెంటర్‌కు ఫోన్ చేయగా.. డీటీడీసీ కొరియర్ ద్వారా ఎప్పుడో పంపేశామని చెప్పారు.
దీంతో ఆమె గూగుల్ సెర్చ్ చేసి డీటీడీసీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి విషయం చెప్పారు. పది నిమిషాల్లో మరో వ్యక్తి కాల్ చేసి డెలివరీ బాయ్‌గా పరిచయం చేసుకున్నాడు. 20 రోజులుగా పార్సిల్ తన దగ్గరే ఉందని, వర్షాల కారణంగా డెలివరీ చేయలేకపోయానని తెలిపాడు. ఓ లింక్ పంపిస్తానని దాని ద్వారా రూ.10 చెల్లిస్తే డెలివరీ చేస్తానని చెప్పడంతో ఆమె సరేనంది.
తన సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో అతడు పంపిన లింక్ ఓపెన్ కాలేదు. దీంతో కిచెన్‌లో వంట చేస్తున్న తన రూమ్‌మేట్ ఫోన్ నంబరు అతడికి చెప్పింది. ఆ ఫోన్‌కొచ్చిన లింక్‌ను ఓపెన్ చేసి తన ఐడీ వివరాలు పంపించగా… పిన్ నంబర్ తప్పుగా ఇచ్చారంటూ అవతలి వైపు వ్యక్తి అరవడంతో అనుమానమొచ్చి ఆమె ఫోన్ కట్ చేసింది.
మూడు, నాలుగు రోజులు తర్వాత ఆ స్నేహితురాలికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ గూగుల్ పే, ఫోన్ పే, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు కట్టేందుకు ప్రయత్నించగా ఓపెన్ కాలేదు. మళ్లీ రిజిస్టర్ చేసుకోమని సూచించడంతో కంగుతిని బ్యాంకులో సంప్రందించగా… అప్పటికే రూ.2 లక్షలు డెబిట్ అయినట్లు తెలిసింది. ఆ ఖాతా నుంచి స్నేహితురాలికి కూడా రూ.50వేలు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఉండటంతో అవాక్కైంది.
ఇద్దరికీ ఒకే బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి. దీంతో బాధితురాలి ఖాతాలో బ్యాలెన్స్ చూడగా రూ.17.6 లక్షలు డెబిట్ అయినట్లు తేలింది. ఆమె మొబైల్ బ్యాంకింగ్ యాప్ కూడా ఓపెన్ కావడం లేదు. బ్యాంక్‌కు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకుని పరిశీలించగా వివిధ రాష్ట్రాల్లోని ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసినట్లు చూపించింది.
ఇదే విషయాన్ని బ్యాంక్ అధికారులకు చెప్పగా సర్వర్ కూడా హ్యాక్ చేసి ఉంటారేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో బాధితురాళ్లు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితురాలి బ్యాంక్ అకౌంట్‌ను బ్లాక్ చేయించారు. ఓటీపీ రాకుండానే డబ్బులు దోచేయడంతో సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపినట్లు పోలీసులు గ్రహించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.