దక్షిణ అండమాన్ సముద్రంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఉపరితల ఆవర్తనంగా బ్యాంకాక్ పరిసరాల్లో కొనసాగుతూ నేడు అండమాన్‌కు చేరుకునే అవకాశం ఉందని అంచనా. అల్పపీడనం ఏర్పడ్డాక ఇది 48 గంటల్లో వాయుగుండంగా బలపడుతుంది. ఆ తర్వాత తుపానుగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని గమనాన్ని బట్టి మంగళవారం పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తుపానుగా మారితే కాకినాడ తీరం నుంచి ఒడిశా వరకు దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. తుపానుగా మారితే వచ్చే నెల 2 నుంచి దీని ప్రభావం రాష్ట్రంపై ఉండనుంది. మరోవైపు కోమరిన్, శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల సోమవారం కూడా నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.