లిబియాలో ‘డేనియల్’ తుపాను .. 5300 చేరిన మృతుల సంఖ్య

Cyclone 'Daniel' death toll reaches 5300 in Libya
Cyclone 'Daniel' death toll reaches 5300 in Libya

ఎటుచూసినా గుట్టలు గుట్టలుగా మృతదేహాలు.. శిథిలాల కింది నుంచి ఆర్తనాదాలు.. ఏ వైపు చూసినా ఏరులై పారుతున్న రక్తం.. ఆఫ్రికా దేశం లిబియాలో ప్రస్తుతం కళ్లకు కడుతున్న విషాద దృశ్యాలు ఇవి. ఆ దేశంలో డేనియల్‌ తుపాన్‌ జలప్రళయం సృష్టించింది. వర్షాల కారణంగా రెండు డ్యామ్​లు బద్దలవ్వడంతో వరద పోటెత్తి ప్రజలను సముద్రంలోకి లాక్కెళ్లింది. భవనాలు, కార్యాలయాలు అన్నీ నీటిలో కొట్టుకుపోయాయి.

ఇప్పటి వరకు ఆ దేశంలో 5300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లిబియా అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబు లమౌషా తెలిపారు. మరో 10 వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు చెప్పారు. డెర్నా నగరంలోనే ఎక్కువ నష్టం జరిగినట్లు వెల్లడించారు. డెర్నాలో పరిస్థితి ఘోరంగా ఉందని.. రహదారులపైనే అనేక మృతదేహాలు పడి ఉన్నాయని లిబియా ఆరోగ్య మంత్రి ఒత్మాన్‌ అబ్దుల్‌ జలీల్‌ వెల్లడించారు.

లిబియా ప్రధాని ఒసామా హమద్‌ రెండు డ్యామ్‌లు కొట్టుకుపోవడం వల్ల వరద తీవ్రత పెరిగిందని తెలిపారు. అందుకే తీవ్ర ప్రాణ నష్టం జరిగిందని అన్నారు.హమద్ ఈ కల్లోలం నుంచి తమ దేశం కోలుకోవడం కాస్త కష్టమేనని.. అయినా వీలైనంత త్వరగా కోలుకోవడానికి బలంగా నిలబడటానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు.