ఉత్తరప్రదేశ్ అలీఘఢ్లోని బొమ్మల తయారీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీగఢ్ ఢిల్లీ గేట్ ప్రాంతంలోని ఖాతికన్ ప్రాంతంలోని ఒక భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అలీఘఢ్లోని బొమ్మల తయారీ కర్మాగారంలో మంగళవారం సాయంత్రం సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది. పరిసరాల్లోని పలు ఇండ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు కారణంగా, భవనం పైకప్పు కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులపై శిథిలాలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ముగ్గురు మరణించారు.
కాగా క్షతగాత్రులను జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ దవాఖాన, మల్ఖన్ సింగ్ జిల్లా ఆసుపత్రులకు తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఐదు ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచే శిథిలాలను తొలగించే పని చేపట్టారు. స్థానిక వలంటీర్ల బృందాలు సహాయక చర్యలకు సహకరిస్తున్నాయి. కాగా ఏదైనా పేలుడు కారకాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయా అన్న కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారని నగర పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ కుమార్ తెలిపారు.