టీఆరెస్ కి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అయిన డీఎస్ !

D Srinivas may join in Congress from TRS

తెలంగాణ రాష్ట్ర సమితి నేత డి.శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. దీంతో డి.శ్రీనివాస్ మీద సొంత పార్టీ నేతలే కక్ష కట్టారు. గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పై నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలంతా ఒక్కటై సమావేశమయ్యారు. కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత దీనికి సారథ్యం వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేగుతోంది. డీఎస్ కదలికలపై తమకు అనుమానం ఉందని, డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ నేతలంతా ఒక్కటై డీఎస్ కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. డీఎస్ కావాలని నిజామాబాద్ అర్బన్, రూరల్ జిల్లాల్లో పార్టీని బలహీన పరుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ లో కొనసాగుతూ పచ్చి అవకాశవాదిగా మారి కొడుకును బీజేపీలోకి పంపారని, కాంగ్రెస్ లో చేరేందుకు డీఎస్ ఢిల్లీ పెద్దలతోమంతనాలు జరుపుతున్నారని ఒక కుటుంబం కోసం పార్టీ ఇబ్బంది పడుతుందని, ఇన్ని రోజులు ఓపిక పట్టామని, ఇంకా ఆయనను ఇక ఉపేక్షిస్తే పార్టీకి నష్టం తప్పదని ఆ లేఖలో హెచ్చరించారని తెలుస్తోంది.

ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి… కారు ఎక్కిన డీ.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఆ పార్టీలో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు వార్తలు రావడం ఈ వార్తలకు ఊతం ఇచ్చేలా డీఎస్ గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. తెరాసలో తనకు తగిన ప్రాధాన్యత, గ్రూపు రాజకీయాలు తదితర కారణాలతో ఆయన పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క డీ శ్రీనివాస్ పై నేడు టీఆర్ఎస్ నాయకత్వం వేటు వేయనుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ సైతం ఇటీవలి కాలంలో డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో నేడు ఆయన్ను పార్టీ నుంచి, సలహాదారు పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడతాయని టీఆరెస్ నేతలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు.