మోదీ ప్లాన్ కి బాబు చెక్… చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ !

Modi plans early polls in india but Chandrababu may rejects

మామూలుగా అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2019 ఏప్రిల్-మే నెలల్లో జరగాలి. కానీ, అంతకంటే నాలుగైదు నెలల ముందే ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్ని కుదిరితే ఈ ఏడాది అక్టోబర్‌లోనే ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు… అలాగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని భావిస్తున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఎన్నికలకు వెళ్లబోతున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలు కూడా ఉంటాయని అంటున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో… వీటికి ముందస్తు ఉంటుందనే ఊహాగానాలున్నాయి.

ఇటీవలే ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అక్కడ నుంచి తిరిగి వచ్చిన తరువాత మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న హడావుడి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయంగానే కనిపిస్తున్నాయి. మరి ముందస్తు ఎన్నికలు వచ్చేట్లయితే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిపై ఏ నిర్ణయం తీసుకుంటారు?… అంటే… ఆయన అందుకు ముందుకు రారనే ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చిన ముందస్తు ఎన్నికలు అధికార పార్టీని వెక్కిరించాయి. దీనిలో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ పరాజయం చవిచూడటం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి లోకేష్‌లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అక్టోబర్లోనే ఎన్నికలు అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ ముందస్తు ఎన్నికల ఊసే ఉండదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని అందుకే వచ్చే ఏడాది ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకూ ఎన్నికలు వచ్చే అవకాశం లేదని లోకేష్ అన్నారు. ఇక పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… అక్టోబర్లో అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాసం లేదు అని స్పందించినట్టుగా సమాచారం. అంతగా ముందస్తు ఎన్నికలు అన్నా, జనవరి తర్వాతే అని చంద్రబాబు స్పష్టం చేశారట. ఈ ఏడాదిలో మాత్రం ఎన్నికలు ఉండవన్నట్టుగా పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

అయితే, లోక్‌సభను ముందుగానే రద్దు చేసి ఈ రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, తమిళనాడు అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలనే బీజేపీ వ్యూహం మాత్రం పారేలా కనపడం లేదు. ఎందుకంటే అలా జరగాలంటే ఆయా రాష్ట్రాల్లో బలమైన కారణమో, అసాధారణ పరిస్థితులో ఉండాలి. లేదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, తమిళనాడు రాష్ట్రా ప్రభుత్వాల అంగీకారం అవసరం. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ, మోదీకి బద్ధ శత్రువుగా తయారైన చంద్రబాబు అందుకు అంగీకరించకపోవచ్చు. దీంతో ఏపీ ఎన్నికలు నిర్ణీత సమయం ప్రకారమే జరిగే అవకాశం ఉంది.