ఓ తండ్రి, ఇద్దరు కొడుకులు…మూడు పార్టీలు?

D Srinivas Sons Arvind and sanjay All Set To Join BJP and congress

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అధికారం కోసం చేసే ప్రయాణం రాజకీయం అనుకుంటే ఆ దారిలో తనమన ఉండదని మరోసారి తేలిపోయింది. ఇక్కడ ఎవరు నడక వారే నడవాలి. ఎవరి ప్రయత్నం వాళ్ళే చేసుకోవాలి. బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు లాంటివి ఏమీ పని చేయవు ఇక్కడ. అలాంటి ఓ విశేషం ఇది . ఒకే ఇంటి నుంచి వచ్చిన ఓ తండ్రి, ఇద్దరు కొడుకులు మూడు పార్టీల కధ మీకోసం.

డి. శ్రీనివాస్ …ఈ పేరు వినగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి రెండు సార్లు పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన విషయం గుర్తుకు వస్తుంది. వై.ఎస్ కి వున్న ప్రజాదరణ ఆ విజయంలో కీలక పాత్ర అనుకున్నా ఆయనకి జోడీగా నిలబడింది డి . శ్రీనివాస్. ప్రజల్లో, తోటి నాయకుల్లో డీఎస్ కి వై.ఎస్ అంత బలం లేకపోయినా ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర మాత్రం డీఎస్ చెప్పిందే మాటగా చెల్లింది. చివరకు తెలంగాణ ఏర్పాటులోను డీఎస్ పాత్ర కొంత వుంది. అలాంటి డీఎస్ ఎప్పుడైతే కాంగ్రెస్ ని వదిలి తెరాస లో చేరారో 10 జన్ పథ్ కూడా ఉలిక్కిపడింది. తెరాస లో చేరాక ఆయనకి రాజ్యసభ లో స్థానం, రాష్ట్ర క్యాబినెట్ ర్యాంక్ తో సలహాదారు పదవి దక్కాయేమో గానీ కాంగ్రెస్ లో ఉన్నంత గౌరవం, పరపతి లేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బాధతోనే ఆయన పార్టీ మారొచ్చని ఈ మధ్య వినిపించినా ఆ మాటల్లో నిజం లేదని ఆయనే ముందుకు వచ్చి మరీ చెప్పారు.పనిలో పనిగా తెలంగాణ సీఎం కెసిఆర్ ని పొగిడేశారు. అయితే ఆ క్రెడిట్ వస్తుందో,లేదో తెలియక ముందే కొడుకుల రూపంలో తెరాస ముందు డీఎస్ ఇమేజ్ డామేజ్ అయ్యింది.

నిజామాబాద్ లో కెసిఆర్ కుమార్తె కవితని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం బీజేపీ సాగించిన అన్వేషణ డీఎస్ ఇంటి దగ్గర ఆగింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి డీఎస్ చిన్న కొడుకు అరవింద్ ని బీజేపీ తమ లోకి లాగేసుకుంది. తండ్రి తో రాజకీయ విభేదాలు ఉన్నాయా అని అడిగితే అబ్బే అన్న అరవిందుడు ఆ విషయం పక్కనబెట్టి తన తాత , డీఎస్ తండ్రి అయిన ధర్మపురి వెంకటరావు జన సంఘ్ నేతగా వున్న విషయాన్ని గుర్తు చేశారు. కొడుకు చేసిన పనితో కెసిఆర్ దగ్గర డీఎస్ తలెత్తుకునే పనిలేదు.

ఈ వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో అర్ధం కాక డీఎస్ నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఇంకో ప్రమాదం కూడా చాప కింద నీరులా ముంచుకు వస్తోందట. డీఎస్ కి అన్ని విధాలుగా చేదోడువాదోడు గా వుండే ఇంకో కొడుకు సంజయ్ కి నిజామాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ తో కాంగ్రెస్ గాలం వేస్తోందట. ఆయన కూడా అందుకు ఓకే అంటారని ఓ టాక్. ఇది కూడా అయితే ఒక నాన్న, ఇద్దరు కొడుకులు, మూడు పార్టీల కధ నిజం అయిపోతుంది. ఇదేమీ వింత, విశేషం కాదనుకునే రాజకీయాలు నడుస్తున్న రోజులు ఇవి.