నటులు, సినిమా రంగానికి చెందిన వారు యాక్సిడెంట్ లు చేయడం సర్వసాధారణం, అయితే వారు కుర్ర వయసులో ఉన్న వారో, దూకుడుగా ఉండేవారో అలా చేసేవారు కానీ తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు యాక్సిడెంట్ కేసులో ఇరుక్కున్నారు. రాంగ్ రూట్‌లో రాష్‌గా డ్రైవింగ్ చేయడమే కాక ఓ బైక్‌ను ఢీకొట్టి ప్రమాదం చేయడంతో ఆయన మీద కేసు నమోదు అయింది. సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ సమీపంలోని కార్కానా పరిధి టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబుకు చెందిన కారు, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. (యాక్టివా ద్విచక్ర వాహనాన్ని TS09EX2628 నెంబర్ గల లగ్జరీకారు రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టింది). స్వయంగా ఆయనే వాహనం నడిపి ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తోన్న సురేశ్ చంద్ర, ఆయన భార్య దుర్గాదేవి, వారి చిన్నారి సిద్ధేశ్ గాయపడ్డారు.
ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కాలికి గాయం కావడంతో చంద్రకు సైతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దుర్గాదేవి స్వల్పగాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రమాద సమయంలో కారు వేగం 100 కిలోమీటర్ల పైనే ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నాయంటే, వాహనం ఎంత వేగంతో ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో సురేష్‌బాబుకు కార్ఖానా స్టేషన్ పోలీసులు 41a సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల కింద వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.
సాధారణంగా ప్రమాదానికి గురిచేయడమే కాదు వారిని పట్టించుకోకుండా వెళ్లడం కూడా నేరమే. ఆ కారు దగ్గుబాటి సురేష్ బాబు పేరు మీద ఉండటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపించారు. అయితే ఆ కారు ఎవరు నడుపుతున్నారో వారి మీద పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. సురేష్ బాబు పోలీసుల ఎదుట హాజరయితే దీని మీద మరింత స్పష్టత వచ్చే అవకాసం ఉంది.