బాలకృష్ణ తాజా సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా రేపు విడుదల అవుతోంది. ఈ మూవీ టీజర్, ట్రైలర్లు అభిమానులని ఆకట్టుకున్నాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ… సంక్రాంతికి విడుదలైన తన మూవీ లన్నీ హిట్ అయ్యాయని… ఈ మూవీ కూడా అంచనాలకి మించి ఉంటుందని చెప్పారు. ట్రైలర్ కు మించి మూవీ ఉంటుందని తెలిపారు. తన ధైర్యం, తన పొగరు తానేనని… తాను ఎవరి కీర్తినీ మోయనని, తన కీర్తిని కిరీటంగా అలంకరించుకుని తలపై మోస్తానని చెప్పారు. ‘నేను డాకు మహారాజ్. చరిత్ర సృష్టించాలన్నా నేనే… దాన్ని తిరగరాయాలన్నా నేనే’ అని మూవీ లోని డైలాగ్ చెప్పి అభిమానులను అలరించారు.
తనకు పొగరు ఉందని అంటుంటారని… అదే పొగరుతో తన క్యారెక్టర్ ను బిల్డప్ చేసుకుంటానని బాలకృష్ణ తెలిపారు. త్వరలోనే… ‘అఖండ 2’లో విశ్వరూపం చూస్తారని అన్నారు. ప్రతి మూవీ ని వైవిధ్యభరితంగా చేసుకుంటూ ముందుకి సాగుతున్నానని చెప్పారు. ప్రతిభ కలిగిన నటీమణులు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారని కితాబిచ్చారు. ‘యానిమల్’ మూవీ కి ముందే బాబీ డియోల్ ను ఈ మూవీ లో తీసుకున్నామని వెల్లడించారు. ఇక ముందు కూడా మరిన్ని మంచి మూవీ లతో మీ ముందుకు వస్తానని చెప్పారు.