కరోనా వైరస్ సోకిన రోగులు కొన్ని చోట్ల తీవ్రమైన వివక్షకు గురైన పలు సంఘటనలు చూశాం. ఈ మహామ్మరి బారిన పడ్డవారిని కొంతమంది తమ ఇళ్లలోకి, గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే తనకు కరోనా సోకిన సమయంలో వివక్షకు గురైనట్లు బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే చెనిగల్ల శేఖర్ తెలిపారు. తనకు గత ఏడాది జూన్‌లో కోవిడ్-19 సోకిందని ఆ సమయంలో రంగారెడ్డి జిల్లాలోని అల్లోర్ గ్రామస్తులు దారుణంగా తనపై వివక్ష చూపించారని వాపోయారు. అవగాహనతో మెలగాల్సిన గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కూడా అదే వైఖరితో ఉండటంతో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు.
ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారని, ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలని ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చాడు. దీంతో తాను నెల రోజుల పాటు ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేదని పేర్కొన్నాడు. రెండు వారాల తర్వాత కరోనా పరీక్ష చేయించుకోవడానికి కూడా అనుమతించకుండా దారుణమైన వివక్ష చూపారని గుర్తు చేసుకున్నాడు. కాగా, శేఖర్ గత ఎమిదేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నారు. ఇటీవల తొలి విడత వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో టీకా వేయించుకున్నారు. కరోనాకు వ్యాక్సిన్ రావటం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా శేఖర్ పేర్కొన్నాడు. తను పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ వైద్య సిబ్బంది నుంచి ప్రేరణ పొంది వ్యాక్సినేషన్ విధుల్లో భాగమయ్యానని వెల్లడించారు.