కరోనా ఎఫెక్ట్.. తల్లికి పురుడుబోసిన బిడ్డలు

కరోనా ప్రభావంతో ఓ ఇంట్లో తల్లికి కన్న బిడ్డలే పురుడు పోసి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. దీంతో ఇక గత్యంతరం లేక ఆ తల్లి తన ముగ్గురు కుమార్తెల తోడ్పాటుతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన తాజాగా బెంగళూరులో జరిగింది. రాయచూరుకు చెందిన లక్ష్మీ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వలస వెళ్లింది. భర్త, ముగ్గురు కుమార్తెలతో కలసి బ్యాడరహళ్లిలో నివసిస్తుంది. లక్ష్మీ మరోసారి గర్భం దాల్చిన తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె బేల్దారి పనులకు వెళ్లి కుమార్తెలను పోషించుకుంటుంది.

అయితే తాజాగా ఆమెకు 9 నెలలు నిండటంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ.. అప్పటికే అక్కడ కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతుండటంతో ప్రసవం కష్టమని తేల్చి చెప్పారు. వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు వెల్లడించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెలతో కలసి ఇంటికి వెళ్లింది. వెంటనే పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు. వారికి పండండి మగబిడ్డ పుట్టడంతో వారింట ఆనందం వెల్లివెరిసింది. స్థానిక పోలీసులు విషయం గ్రహించి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యసాయం అందంచారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని తెలపిన పోలీసులు ఆ కుటుంబానికి తగిన ఆర్థిక సాయం అందించారు.