కన్న తల్లిని కడ తేర్చిన కూతురు

పోలీసులను కూడా షాక్ కి గురి చేసిన కీర్తిరెడ్డి కేసు
హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లా మునగనూరు గ్రామంలో తల్లిని చంపిన కీర్తిరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కీర్తి తన ప్రియుడి సాయంతో తల్లి రజితను హత్య చేసినట్లు అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ఆమె ప్రియుడు శశికుమారే కీర్తిని బెదిరించి హత్య చేసేలా ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలిసింది.
కీర్తి అందంగా ఉండటం, శ్రీనివాస్‌రెడ్డి, రజిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె కావడంతో పొరుగింట్లో ఉండే శశికుమార్ ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి శారీరకంగా దగ్గరయ్యాడు. ఏకాంత సమయంలో వీడియోలు తీసి తరుచూ లైంగిక దాడికి పాల్పడేవాడు. కీర్తి గర్భం దాల్చడంతో మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. కీర్తిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లి రజితకు చెప్పగా ఆమె నిరాకరించింది.

గతంలో బాల్‌రెడ్డి అనే యువకుడిని కీర్తి ప్రేమించడంతో అతడితో నిశ్చితార్థం చేశారు. ఈ విషయం తెలిసి కూడా శశికుమార్ ఆమెను ప్రేమలోకి దించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే ఇద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు కాబోయే భర్తకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో కీర్తి అతడి చేతిలో కీలుబొమ్మగా మారింది. ఈ క్రమంలోనే తమ బంధానికి అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను చంపేయాలని శశికుమార్ నిర్ణయించుకున్నాడు.

ప్లాన్ ప్రకారం ఈ నెల 19న కీర్తితోనే ఆమె తల్లిని మెడకు చున్నీ బిగించి చంపించాడు. మూడురోజుల పాటు శవం పక్కనే కీర్తితో గడిపాడు. శశికుమార్ చెప్పినట్లుగా తండ్రి, బంధువులు అబద్ధం చెప్పిన కీర్తి చివరకు తానే నేరం చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. ఉన్నత చదువులు చదివి, జీవితంలో మంచిగా స్థిరపడి తమకు కీర్తి కీర్తి ప్రతిష్ఠలు తెస్తుందని భావించిన కూతురు పేగుబంధానికే అపకీర్తి తెచ్చేలా నడుచుకోవడంతో ఆమె తండ్రి, బంధువులు తట్టుకోలేకపోతున్నారు.