Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏ తండ్రయినా…తన వారసత్వాన్ని కొడుకు కొనసాగించాలని కోరుకుంటాడు. సినిమాలు, రాజకీయాలు, వ్యాపారరంగాలకు సంబంధించిన వాళ్లే కాదు..ఇతర రంగాలకు చెందిన వారు కూడా…తమ కొడుకులను వారసులుగా తయారుచేస్తారు. ఇక చుట్టూ మందిమార్బలం, కనుసైగ చేయగానే పనులు జరిగిపోయే పలుకుబడి, వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్న వ్యక్తయితే..తన ఘనమైన వారసత్వాన్ని కొడుకు స్వీకరించాలనే కోరుకుంటాడు కదా…అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా ఇదే కోరుకున్నాడు. తన ఒక్కగానొక్క కొడుకు కూడా తన తర్వాత మాఫియా డాన్ గా తన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించాడు. కానీ ఆయనకు సినిమా ట్విస్ట్ ఎదురయింది.
సాధారణంగా తెలుగు సినిమాల్లో ఓ కథ ఎప్పుడూ పునరావృతమవుతుంటుంది. తండ్రి సినిమాలో విలన్. ఆయన కొడుకు మాత్రం తండ్రి వ్యవహారశైలిని, అక్రమార్జనను వ్యతిరేకిస్తూ సామాన్యులకు దగ్గరగా మసులుతూ హీరో అనిపించుకుంటాడు. దావూద్ ఇబ్రహీంకు కూడా ఇదే పరిస్థితి ఎదురయింది. తండ్రి స్టేటస్, డబ్బు, పలుకుబడి వీటన్నింటికీ ఆయన కొడుకు ఆకర్షితుడు కాలేదు. నేరసామ్రాజ్యం నిర్మించుకున్న విలన్ గానే తండ్రిని చూస్తున్నాడు మోయిన్. దావూద్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆదినుంచి వ్యతిరేకిస్తున్న 31 ఏళ్ల మోయిన్ నవాజ్ డీ కస్కర్ మత పెద్దగా మారాలని నిర్ణయించుకున్నాడు. మసీదులో కూర్చుని, మౌలానాగా సేవలందించడం ద్వారా మోయిన్ ప్రపంచ వ్యాప్తంగా తమ కుటుంబానికి ఉన్న చెడ్డపేరు పోగొట్టాలని భావిస్తున్నాడని థానే యాంటీ ఎక్స్ టార్షన్ సెల్ చీఫ్ ప్రదీప్ శర్మ తెలిపాడు.
తండ్రికి వారసుడిగా ఎదుగుతాడనుకున్న మోయిన్ ఇలా మత పెద్దగా మారాలని నిర్ణయం తీసుకోవండ దావూద్ కుటుంబంలో పెను కలకలం రేపిందని చెప్పారు. కొడుకు ఆలోచనతెలిసి షాక్ తిన్న దావూద్ ప్రస్తుతం తీవ్ర డిప్రెషన్ లో ఉన్నాడని ఆయన వెల్లడించారు. మొత్తానికి మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే దావూద్ కొడుకును మాత్రం తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకోలేకపోయాడన్నమాట.