కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం తాడేపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం గోశాలలో 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కంగారుపడిన నిర్వాహకులు గోశాలలో మిగిలిన ఆవులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
ఫుడ్ పాయిజన్ వల్ల గోవులు మృతి చెందినట్లు గోశాల నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోశాలకు తరలివచ్చారు. గోశాలలో హృదయ విదారకరంగా పడివున్న మృతదేహాలు చూసి కన్నీరు పెడుతున్నారు.
ఈ గోశాలలో గతంలోనూ ఇదే విధంగా 30 గోవులు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి 100 ఆవులు చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాత్రి ఆవులకు పెట్టిన దాణాలో ఎవరైనా ? ఏవైనా విష పదార్థాలు కలిపారా అనే అనుమానం కలుగుతోంది.
ఆవుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తే నిజానిజాలు తెలుస్తాయని స్థానికులు అంటున్నారు గోశాల నిర్వాహకుల మీద కోపంతో ఎవరైనా కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.