బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇకలేరు. చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కాసేపటి క్రితమే కన్నుమూశారు. పెద్దపేగు సంబంధిత వ్యాధితో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మృత్యువుతో పోరాడుతూ.. ఆయన మరణించాడని ఆసుపత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
అయితే గత కొన్నేళ్లుగా ఆయన కేన్సర్ వ్యాధితో పోరాటం చేస్తున్నారు. అలాగే.. కొన్ని నెలల క్రితం కాస్త కోలుకున్నట్లు అనిపించారు. మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురై.. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. కాగా నాలుగు రోజుల క్రితమే ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) మృతి చెందింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆమె అంత్యక్రియలు జరగగా ఇర్ఫాన్ ఖాన్ వెళ్లలేకపోయారు. లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తల్లి అంత్యక్రియలను చూశారు. ఈ ఘటన ఆయనను మరింత కలచి వేసినట్లుగా తెలుస్తోంది. తల్లి మరణంతో ఆయన పూర్తి ఒత్తిడికి లోనైనట్లుగా సమాచారం.
అదేవిధంగా ఇర్ఫాన్ ఖాన్ మృత దేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఓ గొప్ప నటుడిని కోల్పోయామంటూ పలువురు నటులు సోషల్ మీడియా ద్వారా ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా.. ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందిన వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని.. చాలా విచారకరమని సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఇర్ఫాన్ ఖాన్.. సలాం బాంబే సినిమాలో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి… స్లమ్‌డాగ్ మిలియనీర్, మఖ్బూల్, లంచ్‌బాక్స్ చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించారు. ఆ సినిమాల్లో వారి నటనకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. ఇంకా ఇర్ఫాన్ ఖాన్ పలు ప్రాంతీయ భాషల సినిమాల్లో కూడా నటించారు. మహేశ్ బాబు నటించిన సైనికుడు సినిమాలో ఆయన విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. 2011లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఇర్ఫాన్ ఖాన్.. 2018 మార్చిలో తన అనారోగ్యంపై ప్రకటన చేసిన విషయం తెలిసిందే.