Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆరేళ్ల క్రితం సంచలనం సృష్టించిన చిన్నారి శాన్వి హత్య కేసు దోషికి ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలుచేయనున్నారు. భారతీయ అమెరికన్ ను అమెరికా మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. వైజాగ్ కు చెందిన యండమూరి రఘునందన్ కంప్యూటర్ సైన్స్ లో ఇంజినీరింగ్ చదివి హెచ్ -1బీ వీసాపై అమెరికా వెళ్లాడు. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట గ్రామానికి చెందిన వెన్నా ప్రసాదరెడ్డి, లత దంపతులు అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉంటున్నారు. వారి కుమార్తె శాన్వి. చిన్నారి శాన్వి ఆలనాపాలనా చూసేందుకు ప్రసాదరెడ్డి తల్లి సత్యవతి 2012లో అమెరికా వెళ్లారు. ప్రసాదరెడ్డి దంపతులకు యండమూరి రఘునందన్ స్నేహితుడు. అయినప్పటికీ అతను డబ్బు కోసం శాన్విని కిడ్నాప్ చేసే ప్రయత్నంచేశాడు. ఈ క్రమంలో శాన్విని, ఆమె నాయనమ్మ సత్యవతిని దారుణంగా హతమార్చాడు.
భారత్ తో పాటు అమెరికాలోనూ ఈ హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. శాన్విని, సత్యవతిని హత్యచేసిన రఘునందన్ పై తొలుత ఎవరికీ అనుమానం రాలేదు. శాన్వి కోసం అందరితో కలిసి వెతుకుతున్నట్టు రఘనందన్ నటించడంతో ఎవ్వరూ అతన్ని అనుమానించలేదు. అయితే డబ్బుకోసం డిమాండ్ చేస్తూ రాసిన లేఖ బయటపడడంతో రఘునందన్ నిజస్వరూపం అందరికీ తెలిసింది. వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అపహరించి, బెదిరించి, భారీ సంపద రాబట్టుకోవడానికే రఘునందన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. పెన్సిల్వేనియా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. ప్రాణాంతక ఇంజక్షన్ ద్వారా శిక్ష అమలుచేయనున్నారు అయితే..మరణశిక్షలపై పెన్సిల్వేనియా గవర్నర్ టామ్ వూల్ఫ్ విధించిన ఆంక్షల కారణంగా నిందితునికి కొంత ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. మరణశిక్షలపై అధ్యయనం చేసిన సలహా సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు. గత 20 ఏళ్లలో పెన్సిల్వేనియాలో ఒక్క మరణశిక్షనూ అమలుచేయలేదు.