అనుకున్నట్లు అన్నీ కుదిరితే దీపికా పదుకోన్‌ని ప్రేక్షకులు సీత, ద్రౌపది పాత్రల్లో చూసే అవకాశం ఉంది. ఇప్పటికి ద్రౌపది పాత్ర ఖరారైంది. సీత పాత్ర ఖరారు కావాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు పాత్రలూ దీపికా చేస్తే.. రెండు పౌరాణిక పాత్రల్లో నటించిన ఘనత దీపికాకే దక్కుతుంది. ఇక విషయంలోకి వస్తే.. దీపికా పదుకోన్ కథానాయికగా రెండేళ్ల క్రితం ‘మహాభారత’ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.
రెండేళ్లయినా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో ‘మహాభారత’ ఆగిందనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి. ఈ వార్తలకు చిత్రనిర్మాత మధు మంతెన ఫుల్‌స్టాప్ పెట్టారు. ‘‘దీపికాకు ఈ కథ నచ్చి, నటించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉండాలనుకున్నారు. ద్రౌపది దృష్టి కోణం నుంచి మహాభారతాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
పురాణాలు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా పరిశోధనలు చేసి, సమాచారం సేకరించాం. ఇప్పుడు స్క్రీన్‌ప్లేకి కావాల్సిన సమాచారం మా దగ్గర ఉంది. అయితే ఈ సినిమాకి టైమ్ పడుతుంది. ఈలోపు ‘రామాయణ’ మొదలుపెడతాం. అయితే ఇంకా నటీనటులను అనుకోలేదు. రానున్న దీపావళికి ‘రామాయణ’ నటీనటులను ప్రకటించాలనుకుంటున్నాం’’ అన్నారు.
అయితే ‘రామాయణ’లో సీత పాత్రను దీపికా చేయనున్నారనే వార్త ఉంది. అలాగే స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ‘సీత: ది ఇన్‌కార్నేషన్’ కథ రాస్తున్నారు. ఈ సినిమాలో సీతగా దీపికా నటిస్తారనే టాక్ కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కదాంట్లో అయినా సీతగా ఆమె నటిస్తే.. అటు ద్రౌపదిగానూ ఇటు సీతగానూ నటించిన ఘనత దీపికాకు దక్కుతుంది.