Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పద్మావతి లాంటి గొప్పచిత్రాన్ని వివాదాల పాలు చేయడం నిజంగా ఘోరమైన విషయమని హీరోయిన్ దీపికా పదుకునే ఆవేదన వ్యక్తంచేసింది. సినిమా విడుదల గురించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం సెన్సార్ బోర్డుకు మాత్రమే ఉందని, అందుకే ఇలాంటి ఎన్ని వివాదాలు వచ్చినా… చిత్ర విడుదలను ఎవరూ ఆపలేరని ఆమె విశ్వాసం వ్యక్తంచేసింది. పద్మావతి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఈ చిత్రంలో నటించినందుకు ఒక మహిళగా తాను చాలా గర్వపడుతున్నానని దీపిక చెప్పింది. డిసెంబరు 1న పద్మావతి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే రాజ్ పుత్ ల చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ రాజ్ పుత్ కర్ణిసేన, మేవార్ రాజవంశస్థులు పద్మావతిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు నటీనటులంతా… సినిమా తప్పక విడుదలవుతుందనే నమ్మకంతో ఉన్నారు.
అటు ఈ నవంబర్ తో దీపిక బాలీవుడ్ లో అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతాయి. షారూఖ్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించిన ఓం శాంతి ఓంతో దీపిక బాలీవుడ్ ప్రయాణం మొదలయింది. మధ్యలో కొన్ని అపజయాలు పలకరించినా… వాటన్నింటినీ దాటుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీపిక తొలి సినిమా ఓం శాంతి ఓం రిలీజ్ అయిన నవంబర్ 9నే… సంజయ్ లీలా భన్సాలీ సావరియా విడుదలయింది. బాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ అయిన భన్సాలీ సినిమాలో తాను హీరోయిన్ అవుతానని అప్పట్ల ఊహించలేదని దీపిక చెప్పింది. అలాంటి దీపిక చారిత్రక నేపథ్యంతో భన్సాలీ తెరకెక్కించిన మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేయడం విశేషం.