మొత్తానికి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతే నిజమని తేలింది. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ నటించబోయే కొత్త చిత్రంలో దీపికా పదుకొనేనే కథానాయికగా ఖరారైంది. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దీపిక.. ‘బాహుబలి’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్ పక్కన కథానాయిక అనగానే అందరిలోనూ ఎగ్జైట్మెంట్ కనిపిస్తోంది. ఈ అప్డేట్తో సినిమా స్థాయి ఇంకా పెరిగింది.ఐతే ఈ చిత్రంతోనే దీపిక తెలుగులోకి అడుగు పెడుతోందని అంతా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఆమె టాలీవుడ్ అరంగేట్రం ఎప్పుడో జరిగిపోయింది.
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ కోసం ఓ తెలుగు సినిమాకు పని చేసింది దీపిక. ఆయనకు దీపిక క్లోజ్. జయంత్ దర్శకత్వంలో ‘లవ్ ఫర్ ఎవర్’ అనే సినిమా తెరకెక్కగా.. అందులో దీపిక ఓ ఐటెం సాంగ్ చేసింది. దీనికి సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి. కానీ ఎందుకో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.
దీపిక తెలుగు పాటను చూసే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఆ తర్వాత జయంత్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ‘తీన్ మార్’ సినిమాలో ఓ పాటలో దీపికతో స్టెప్పులు వేయిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాలేదు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన పాన్ ఇండియా మూవీ ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. దీపిక తన మాతృభాష అయిన కన్నడలో ఇప్పటికే నటించింది.