మహిళా వివాహ వయసు పెంపు

మహిళా వివాహ వయసు పెంపు

స్త్రీల కనీస వివాహ వయసును 21ఏళ్లకు పెంచుతూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొందరికి బాధను కలిగిస్తోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. మహిళలు విద్య, అభివృద్ధికి మరింత సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2 లక్షల మందితో జరిగిన మహిళా ర్యాలీలో ఆయన మంగళవారం ప్రసంగించారు. ప్రధానిమంత్రి ఆవాస్‌ యోజన కింద కేటాయించిన ఇళ్లలో 25 లక్షల ఇళ్లు యూపీ మహిళలకిచ్చామని చెప్పారు. అమ్మాయిల వయసు పెంపు ఈ దేశ ఆడబిడ్డల కోసం తీసుకున్న నిర్ణయమని, దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారో అందరూ చూస్తున్నారని ప్రత్యర్ధులపై పరోక్ష విమర్శలు చేశారు.

స్త్రీల వివాహ వయసు పెంపు నిర్ణయంపై సమాజ్‌వాదీ ఎంపీలు షఫీకర్, ఎస్‌టీ హసన్‌ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం యూపీలో మహిళలకు రక్షణ, అవకాశాలు పెరిగాయన్నారు. ఈ సందర్భంగా పలు పథకాల లబ్దిదారులతో ఆయన మాట్లాడారు. గర్భిణీలకు టీకాలు, పౌష్టికాహారం తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని మోదీ చెప్పారు. రాష్ట్రంలోని ఎస్‌హెచ్‌జీ(స్వయం సహయాక బృందం)ల బ్యాంకు అకౌంట్లకు ఆయన రూ. వెయ్యి కోట్లు బదిలీ చేశారు. దీంతో సుమారు 16 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో మహిళలే విజేతలని మోదీ అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పలు పథకాల లబ్దిదారులకు నిధులను విడుదల చేశారు.