దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రేపటిలోగా ఎయిర్ ఎమర్జెన్సీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు.. ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
తక్షణం కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. అదే విధంగా.. పంట వ్యర్థాలను కాల్చడాన్ని వారంపాటు ఆపేయాలని రైతులను కోరింది. అలానే ఢిల్లీలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారం రోజుల పాటు వర్క్‌ఫ్రం హోం అవకాశం కల్పించాలని ఆదేశించింది.
ఇప్పటికే మరోసారి లాక్‌డౌన్ విధింపునకు తాము సిద్ధమే అని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంలో ప్రత్యేక అఫిడవిట్‌లను దాఖలు చేశాయి. కాగా, ఢిల్లీలో ప్రజలు జీవించడానికి భయపడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, గతం వారం నుంచి ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిన సంగతి తెలిసిందే.