జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లి శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, దేశంలోనే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాను సీనియర్ నేతలని చెప్పారు. బీజేపీ పాలనలో దేశ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయని, కీలకమైన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని విమర్శించారు. సీనియర్ నేతలుగా తామంతా ఆందోళన చెందుతున్నామని చెప్పారు.
భవిష్యత్ తరాలను, దేశాన్ని రక్షించడానికి తాము పూనుకున్నామని తెలిపారు. అందరం కలసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. శరద్ పవార్ మాట్లాడుతూ, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సేవ్ కంట్రీ, సేవ్ డెమోక్రసీ’ పేరుతో తామంతా ముందుకు సాగుతున్నామని చెప్పారు. భావసారూప్యం ఉన్న పార్టీలన్నీ తమతో కలసి రావాలని కోరుతున్నామని తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ, సీబీఐ, ఆర్బీఐలలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని… దీనిపై తాము చర్చించామని తెలిపారు. రానున్న ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించామని వెల్లడించారు. దేశ భవిష్యత్తు కోసం బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే ఇది పెద్ద సమస్య అనే బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో పర్యటించిన బాబు పలు పార్టీల నేతలను కలిశారు.వారిలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మాయావతిని ఉన్నారు. ఆ సమయంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ దేశాన్ని ఎలా రక్షించుకోవాలన్న అంశంపై చర్చించుకున్నామని దేశం ముఖ్యం, దేశ భిన్నత్వాన్ని కాపాడుకోవడం ముఖ్యమని, అందుకోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. అన్ని పక్షాలను కలుపుకుపోతామని ఐక్యత సాధిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, గెలిచాక నిర్ణయించుకోవచ్చని ఆయన చెప్పారు. కూటమి నేతనని, ప్రధాని అభ్యర్థినని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పుకోలేదని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అప్పుడు ఫరూక్‌కు భిన్నంగా మాయావతి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని చంద్రబాబుతో మాయావతి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలపడాల్సిన అవసరం ఉందని, ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలోకి వస్తే నియంతృత్వ పోకడలు ఉండవని ఆమె బాబుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన మరోసారి ఢిల్లీలో పర్యటించడం శరద్ పవార్, ఫరూక్ లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం రాజకీయ వర్గాల్లో హట్ టాపిక్‌గా మరింది. చంద్రబాబు చుట్టూ ఢిల్లీ రాజకీయం తిరుగుతోందని, ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పబోతున్నారని ఆయననే ఇప్పుడు నేతలు కూటమి కన్వీనర్ గా ప్రకటించినా ఆశ్చర్యం లేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.