జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘాటుగా బదులిచ్చారు. విజయవాడలో ఈరోజు మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో చింతమనేని మాట్లాడారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటూ తనపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని తనను నాణేనికి ఓ వైపే చూశారని, రెండో వైపు కూడా చూసి నిజాలు తెలుసుకోవాలని సూచించారు. ఒక రాష్ట్ర పార్టీ అధినేత నియోజకవర్గ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడని అన్నారు. ఆకు రౌడీ, వీధి రౌడీ అంటున్నావ్. ఆ మాటలు నీకు బాగనిపిస్తే.. రిజిస్టర్ చేసుకో.. సినిమాలకు బావుంటాయి. కానీ, సగటు మనిషినైన నాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు’ అని చింతమనేని అన్నారు.
‘నాపై ఓసారి 27 కేసులు అంటావ్.. మరోసారి 37 కేసులు అంటావ్.. ఎవడో రాసిస్తే చదవడం కాదు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. నా మీద ఉన్నది కేవలం 3 కేసులు. అవి కూడా ధర్మాలు, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో పెట్టినవి. చాలా మంది ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఉద్యమం నాటి కేసులు తీసేయించాలని ముఖ్యమంత్రిని కోరారు. కానీ, నేనలా చేయలేదు’ అని చింతమనేని చెప్పారు. అలాగే ‘తమ్ముడూ నీకు రుణ పడి ఉంటా నీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నా గురించి తెలసుకునే అవకాశం వచ్చిందిని పవన్‌ను తమ్ముడు అని సంబోధించి చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
తన నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలు తెలియాలని, అందుకే మీడియా ముందుకు వచ్చానని ఆయన తెలిపారు. ‘జీవితంలో మొట్టమొదటిసారిగా ఇంత మంది మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్నాని చింతమనేని అన్నారు. ‘రెడ్డి ప్పలనాయుడు అనే వ్యక్తి నా మీద కక్షగట్టాడు. ఎంపీపీ పదవి నుంచి తీసేశారని అతడికి కోపం. దెందులూరు మండలంలో పదవి పంపకానికి సంబంధించిన ఒప్పందం మేరకే ఆయణ్ని పదవీ బాధ్యతలను రెండేళ్ల తర్వాత మరొకరికి అప్పగించాం. రెడ్డప్ప ఐఎఫ్‌టీయూ నాయకుడు. నన్ను హత్య చేయడానికి ప్రయత్నించారు. అలాంటి వాళ్ల ట్రాప్‌లో పవన్ పడిపోయారు’ అని చింతమనేని అన్నారు.
‘తమ్ముడూ.. నీ వ్యక్తిగత విషయాలు చెబితే నువ్ 3 రోజుల వరకు భోజనం కూడా చేయవు. నీ ఫ్యాన్స్‌ను అసహనానికి గురి చేయడం నాకు ఇష్టం లేదు. నీకు దమ్ముంటే.. దెందులూరుకు ఏం చేస్తావో చెప్పు. ఇక్కడికి రా.. ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం’ అని చింతమనేని సవాల్ విసిరారు. పవన్ తనపై పొరపాటుగా మాట్లాడానని తెలుసుకునే రోజు ఎప్పటికైనా వస్తుందని చింతమనేని అన్నారు. తానొక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చానని తెలిపారు. ఒక మామూలు కార్యకర్తగా వచ్చి క్రమశిక్షణ గల టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఎదిగానని చెప్పారు. అలాగే తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమా అని పవన్ కు ఆయన సవాల్ విసిరారు.