క్లారిటీ ఎప్పటికి వస్తుంది పవన్ నీకు ?

Pawan Kalyan Sensational Comments On Ysrcp In Vijayawada

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని ప్రారంభించిన ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇంత వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. పోటీ చేయాలా వద్దా అన్న ఆలోచనలతోనే పుణ్యకాలం గడిపేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు కానీ చివరికి ఆయన పోటీ చేయకపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు బలంగా వినిపించడానికి నిర్ణయం తీసుకోలేకపోతున్న పవన్ కల్యాణ్ బలహీన ప్రధానంగా కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల విషయంలో పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు ప్రధానంగా దీన్నే సూచించింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాల్లో మునిగిపోయాయి. కానీ పవన్ కల్యాణ్ మాత్రం తన కనీస స్పందనను వారం రోజుల తర్వాత ప్రెస్‌నోట్‌ రూపంలో వెల్లడించారు. అందులో ఏం చెప్పారంటే అసెంబ్లీని రద్దు చేశారు కాబట్టి తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నామంటూ ఎదో చెప్పారు. నిజానికి ఆ మాట చెప్పడానికి వారం రోజుల సమయం పట్టదు మరి ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. పోటీ చేస్తున్నారో లేదో చివరి క్షణం వరకూ అంటే నామినేషన్ల గడువు ముగిసే వరకూ.. అధికారికంగా ప్రకటించలేదు.

మధ్యలో ఫ్యాన్స్ వెళ్లి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తే త్వరలో నిర్ణయం తీసుకుందామంటూ చెప్పుకొచ్చారు. చివరికి నామినేషన్ల గడవు ముగిసేటప్పుడు ముందస్తు రావడం వల్ల ప్రిపేర్ కాలేకపోయామని చెప్పి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నిజానికి ఆ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పటికే నామినేషన్ల గడువు ముగిసింది కాబట్టి పోటీ చేయరని క్లారిటీ ప్రజలకు వచ్చేసినట్లే. అయితే పోటీ ప్రస్తావన వచ్చినప్పుడు ముందస్తు రావడం వల్లే పోటీ చేయడం లేదని చెప్పడంతో పాటు ఎవరికి మద్దతిస్తామో చెప్తామని చెప్పిన ఆయన చివరికి ఆది కూడా తేల్చకుండా కూడా చివరికి వరకూ నాన్చారు. అయితే పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కి మద్దతిస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ చివరికి తన గందరగోళం మొత్తం కనిపించేలా ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఎవరికి మద్దతన్న విషయం చెప్పకుండా ముందస్తు ఎన్నికలు వచ్చినందున సమయం లేక తెలంగాణలో జనసేన పోటీ చేయలేకపోయిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు.

తెలంగాణను ఇచ్చామని ఒకరు, తెలంగాణను తెచ్చామని మరొకరు విరుద్ధ ప్రకటనలు చేస్తున్న దశలో ప్రజలు అయోమయంలో ఉన్నారని పవన్ అన్నారు.ఈ సమయంలో ఎవరికి ఓటేయాలన్న దానిపై ప్రజలు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో మంచి పరిపాలన అందించగలరో వారికే ఓటేసి తెలంగాణలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ తెలంగాణలో టీఆర్ఎస్‌-బీజేపీ రహస్య కూటమికి లోపాయికారీ మద్దతిస్తున్నారని టీడీపీ నేతలు కొద్దిరోజులు నుంచి ఆరోపిస్తున్నారు. జనసేనకు ఉన్న ఓటింగ్ అధికార పార్టీకి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా గమనించారు. అయితే తన మద్దతు ఎవరికో చెప్పని పవన్.. అవినీతి తక్కువగా చేసే పార్టీకే ఓటేయాలని పిలుపునివ్వడం పవన్ కల్యాణ్‌కు ఇంకా స్పష్టమైన అవగాహన రాలేదని మాత్రం క్లారిటీ వచ్చిందన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.