అఖిల ప్రియ టీడీపీని వీడుతుందా…?

Deputy CM Chinarajappa Responds On Minister Akhila Priya Issue

ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ గన్ మెన్ల వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగుదేశంలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌న్మెన్లను ఆమె వెన‌క్కి పంపించేసి, జ‌న్మ‌భూమి మా ఊరు కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని పోలీసులు వ‌స్తున్నా ఆమె నిరాక‌రించి వెనక్కి పముతున్నారు. అయితే, అదీ కాక జిల్లాలో జరుగుతున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌భ‌కు కూడా అఖిలప్రియ దూరంగా ఉండ‌టం ద్వారా పార్టీ అధిష్టానానికి తన నిర‌స‌న వ్య‌క్తం చేసి అఖిల‌ప్రియ ఎలాంటి సందేశం ఇద్దామ‌నుకుంటున్నారనే దానిపై ఇప్పుడు టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తమౌతున్నాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో ఇటీవ‌ల పోలీసులు కార్డ‌న్ సెర్చ్ నిర్వహించారు. వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, అనుచ‌రుల ఇళ్ల‌లోకి అర్ధ‌రాత్రిపూట పోలీసుల చొర‌బ‌డి, త‌నిఖీలు చేశారు. ఈ క్ర‌మంలో త‌న అనుచ‌రుల ఇళ్ల‌పై దాడులు చేయ‌డాన్ని అఖిల‌ప్రియ తీవ్రంగా ప‌రిగణించిన‌ట్టు స‌మాచారం.

ఈ కార్డ‌న్ సెర్చ్ మీద స్థానిక పోలీసుల‌ను అఖిల‌ప్రియ ప్రశ్నిస్తే ఉన్న‌తాధికారుల ఆదేశాల మేర‌కే చేశామ‌ని చెప్పార‌ట‌. ఆ త‌రువాత‌, అధికారుల‌తో బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు చేసినా వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణ‌గ‌లేద‌ని తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చిన‌రాజ‌ప్ప చేసిన వ్యాఖ్య‌లు కూడా చ‌ర్చ‌కు ఆస్కారం ఇస్తున్నాయి. ఆవిడ‌కు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంద‌నీ, స‌మ‌స్య‌లు వ‌స్తే పెద్ద‌ల‌తో చెప్పి ప‌రిష్కారం చేసుకోవాల‌నీ, విష‌యం ముఖ్య‌మంత్రి దృష్టికి వెళ్లింద‌నీ, ఆయ‌న ప‌రిష్క‌రిస్తార‌నీ, పోలీసులు వారి డ్యూటీ వారు చేశార‌ని చిన‌రాజ‌ప్ప అన్నారు. ముఖ్య‌మంత్రి దృష్టికి వ్య‌వ‌హారం వెళ్లింద‌ని హోం మంత్రి అంటున్నా ప్ర‌భుత్వం దీన్ని పెద్ద‌గా సీనియ‌ర్ గా తీసుకున్న‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. ప‌ట్టువిడుపు ధోర‌ణితో అఖిల‌ప్రియ వ్య‌వ‌హ‌రించాల‌నీ, పంతానికి పోవ‌డం స‌రికాద‌నే సంకేతాలు పార్టీ నుంచి వ‌స్తున్నాయ‌ట‌. అదీ కాక ఆమె జనసేనలో కానీ, వైసీపీలో కానీ చేరే అవకాశాలు ఉన్నాయని నిన్న ఒక చానల్ అయితే ప్రత్యేక కధనన్ని ప్రచారం చేసింది. ఈ నేపధ్యంలో అఖిల ప్రియ వ్యవహారం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.