Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా పేరుతో వేలకోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి..బాబా ముసుగులో దశాబ్దాల తరబడి అనేక అకృత్యాలకు ఒడిగట్టిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు… ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. ఈ అపారమైన తెలివితేటలతోనే ఆయన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించాడు. చిన్న స్థాయి నేతల నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతిఒక్కరినీ తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకున్నాడు. ధనం, అధికారాన్ని సొంతం చేసుకుని ఆడింది ఆట, పాడింది పాటగా చలామణీ అయ్యాడు. కానీ ఇద్దరు సాధ్విల న్యాయపోరాటంతో బాబా అకృత్యాలు వెలుగుచూశాయి. అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దోషిగా నిర్ధారణ అయిన రోజు పంచకులలో విధ్వంసం సృష్టించి తప్పించుకునిపోయేందుకు ప్రణాళిక రచించిన డేరా బాబా…. అది విఫలం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జైలులో ఉంటున్నాడు. ఇప్పుడు జైలు కేంద్రంగానే ఆయన వ్యూహాలు రచిస్తున్నాడు.
మతం కార్డు ఉపయోగించి అల్లర్లు సృష్టించి శిక్ష తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ప్రసంగించిన ఓ వీడియో గమనిస్తే ఈ విషయం అర్దమవుతుంది. గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని డేరా అనుచరులు ఆరోపిస్తున్నారు. హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తామంతా ఇస్లాం మతంలో చేరతామని వారు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు సందీప్ మిశ్రా ముసుగు ధరించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీతో డేరా అనుచరులు టచ్ లో ఉన్నారని ఆ వీడియోలో సందీప్ మిశ్రా చెప్పాడు. హిందుస్థాన్ ను అభిమానిస్తే కంటి నుంచి నీరు తప్ప మరేమీ రాదని, సొంత దేశంలో హిందువుగా ఉండడం నేరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశాడు.
విశ్వాసంపై దాడి జరిగినప్పుడు మతం ఎందుకు మారకూడదని ప్రశ్నించిన ఆయన తన ఆలోచనలకు దగ్గరగా ఉండేవారితో కలుస్తానని ఆ వీడియోలో వెల్లడించాడు. సందీప్ మిశ్రా వెనక ముసుగు ధరించి నిల్చున్న మరో వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఇస్లాంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని, ముస్లింలను తాకే సాహసం కూడా ఎవరూ చేయబోరని, వాళ్లు రాళ్లు విసిరినా ఏమైనా అనే ధైర్యం ఎవరికీ ఉండదని వ్యాఖ్యానించాడు. తమ నేతలు ముస్లిం లీడర్లతో మాట్లాడుతున్నారని, డేరా అనుచరులు లక్షమంది ఇస్లాం పుచ్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని వెల్లడించాడు. అయితే ఈ వీడియో వెనక గుర్మీత్ హస్తం ఉందని పలువురు అనుమానిస్తున్నారు. గుర్మీత్ కు మతం కార్డు ఎలా వాడుకోవాలో తెలుసని…అందుకే అనుచరులతో ఈ విధమైన ప్రకటనలు చేయిస్తున్నాడని భావిస్తున్నారు. డేరా బాబాగా చలామణీ అయ్యే రోజుల్లోనూ తన అనుచరుల్లో కొందరి పేర్లను ముస్లిం పేర్లుగా మార్చి..ఇస్లాం మతస్థులు కూడా తన అనుచరులుగా ఉన్నారని ఆయన చెప్పుకునే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గుర్మీత్ పన్నాగాన్ని అర్ధంచేసుకుని, డేరా బాబా అనుచరులు ఎక్కువగా ఉండే హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు అప్రమత్తతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు.